Begin typing your search above and press return to search.

విహార యాత్రలో ఊహించని పరిణామం... భిక్కుభిక్కుంటున్న తెలుగు యాత్రికులు

మంగళగిరి వాసుల బస్సుపై ఆందోళనకారులు దాడి చేసి, ప్రయాణికులను భయపెట్టారు. అదేవిధంగా మరో రెండు బస్సులలోనూ ప్రయాణికుల దగ్గర ఉన్న నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు.

By:  Tupaki Desk   |   11 Sept 2025 2:04 PM IST
విహార యాత్రలో ఊహించని పరిణామం... భిక్కుభిక్కుంటున్న తెలుగు యాత్రికులు
X

ఎంతో సంతోషంగా విహారయాత్రలకు వెళ్లిన తెలుగు యాత్రికులకు ఊహించని పరిణామం ఎదురైంది. నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగువారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, తీర్థయాత్రలు, కొందరు ఉద్యోగ సంబంధ పనుల నిమిత్తం ఆ దేశానికి చేరుకున్నారు. కానీ ఇటీవల నేపాల్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందకు భిక్కుభిక్కుమంటున్నారు. ఎవరి దగ్గరా ప్రస్తుతం లగేజీలు లేవు. పాస్‌పోర్టులూ లేవు. నగదు, బంగారం నష్టపోయారు. మరో వైపు రోడ్లపైనే రాత్రులు గడపాల్సిన దుస్థితి నెలకొంది.

హోటళ్లకు నిప్పు – పౌరుల ఆస్తి బుగ్గిపాలు

విశాఖపట్నం ఎల్ఐసీ ఉద్యోగి రాధాకృష్ణమూర్తి కుటుంబంతో పాటు పలువురు యాత్రికులు కాఠ్‌మాండూలో ఒక హోటల్‌లో ఉంటున్న సమయంలో ఆందోళనకారులు నిప్పంటించడంతో వారి దుస్తులు, బంగారం, నగదు అన్నీ కాలిపోయాయి. తిరిగి మరో హోటల్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఘటన నేపాల్‌లో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నది.

హోటళ్లలో బిక్కుబిక్కుమంటూ

కాకినాడకు చెందిన సరళ, రోజారాణి తల్లీకూతుళ్లు, అలాగే శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే ముగ్గురు కాఠ్‌మాండూలో చిక్కుకుపోయారు. విశాఖకు చెందిన మాధవి గణపతి ఓ అంతర్జాతీయ సమావేశానికి వెళ్లి అక్కడే ఆపోవాల్సి వచ్చింది. “అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. చుట్టూ మంటలే కనిపిస్తున్నాయి” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాత్రికులపై దాడులు – దోపిడీలు

మంగళగిరి వాసుల బస్సుపై ఆందోళనకారులు దాడి చేసి, ప్రయాణికులను భయపెట్టారు. అదేవిధంగా మరో రెండు బస్సులలోనూ ప్రయాణికుల దగ్గర ఉన్న నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. ఈ సంఘటనలతో యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భిక్కుభిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

మానస సరోవర, ముక్తీనాథ్ యాత్రికుల ఇబ్బందులు

విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు 61 మంది, శ్రీకాకుళం నుంచి ముక్తినాథ్ యాత్రకు 17 మంది వెళ్లి ప్రస్తుతం కాఠ్‌మాండూలో చిక్కుకుపోయారు. బయటకు రావడం ప్రమాదకరమవడంతో భోజనం కూడా చేయలేని దుస్థితిలో కూరుకుపోయారు. కొద్దిగా ఉన్న సరుకును పంచుకుని గడుపుతున్నామని వారు చెబుతున్నారు.

లోకేశ్ జోక్యం .. కర్నూలు యాత్రికులు సేఫ్

కర్నూలు జిల్లా నుంచి తీర్థయాత్రకు వెళ్లిన 17 మందిలో 15 మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో వారు బిహార్ వరకు చేరి, స్వదేశానికి చేరుకునే ఏర్పాట్లు జరిగాయి.

నేపాల్‌లో తెలుగువారి పరిస్థితి ప్రస్తుతానికి ఒక మానవతా సంక్షోభంగా మారింది. యాత్రికులు ధార్మిక భక్తితో లేదా విహారయాత్ర ఉద్దేశ్యంతో బయలుదేరినా, రాజకీయ అల్లర్ల కారణంగా రక్షణ కోల్పోయారు.

ప్రభుత్వాల సమన్వయం అవసరం – స్థానిక అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయంతో వేగంగా సమన్వయం జరిగితేనే రక్షణ చర్యలు ఫలప్రదం అవుతాయి.

ప్రజల భద్రత ముందుగానే ఆలోచించాలి . విదేశీ యాత్రలకు వెళ్లే పౌరులకు తగిన భద్రతా మార్గదర్శకాలు, అత్యవసర పరిచయ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి

మొత్తం మీద, నేపాల్‌లో తెలుగువారి ఇబ్బందులు కేవలం వ్యక్తిగత దుస్థితి కాదు, భవిష్యత్తులో విదేశీ యాత్రికుల భద్రతా వ్యూహాలను పునః పరిశీలించేలా చేసే సంఘటనగా నిలిచింది.