రష్యాలో భారత టూరిస్టులకు ఎంత కష్టమొచ్చే..?
రష్యా పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులపై అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 10 July 2025 1:00 PM ISTరష్యా పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులపై అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. తాజాగా అమిత్ తన్వర్ అనే పర్యాటకుడు ఈ విషయం వెల్లడిస్తూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాము అకారణంగా నిర్బంధించబడ్డామని, పాస్‌పోర్టులు లాక్కొని, నేరస్థుల్లా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 8న 12 మంది భారతీయులతో కలిసి రష్యా పర్యటనకు బయలుదేరిన అమిత్ తన్వర్, తమకు సరైన పత్రాలు ఉన్నప్పటికీ రష్యా ఇమ్మిగ్రేషన్ అధికారులు తమను నిర్బంధించారని వెల్లడించారు. "వారిలో తొమ్మిది మందిని ఎలాంటి వివరణ లేకుండా గంటల తరబడి ఓ గదిలో ఉంచారు. కేవలం ముగ్గురిని మాత్రమే దేశంలోకి అనుమతించారు. మా పాస్‌పోర్టులు తీసేసి, సెల్‌ఫోన్లలోని ఫొటోలు, సెర్చ్ హిస్టరీ, యూట్యూబ్ యాక్టివిటీ వంటివన్నీ పరిశీలించారు," అని వివరించారు.
అంతేకాకుండా "మా ఫోన్‌లలోని సమాచారం పరిశీలించిన అనంతరం మమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. మరో గదిలో తీసుకెళ్లి పెట్టారు. అక్కడ 2-3 రోజులుగా నిర్బంధంలో ఉన్న ఇతర భారతీయులు కూడా ఉన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా మమ్మల్ని ఉంచుతున్నారు. మాతో వారు చూపుతున్న ప్రవర్తన పూర్తిగా అమానుషంగా ఉంది. విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని స్వదేశానికి వెళ్లాలని అనుకున్నా, ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు" అని తన్వర్ వాపోయారు.
- భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి
ఈ సందర్భంగా అమిత్ తన్వర్ మాస్కోలోని భారత రాయబార కార్యాలయం , ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేడుకున్నారు. "మేము నేరస్థులు కాదని, ఎందుకు బహిష్కరిస్తున్నారో స్పష్టం చేయాలని, మాకు న్యాయం చేయాలని" ఆయన కోరారు.
- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యం.. పెరుగుతున్న అనుమానాలు
ఇటీవల ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలో చిక్కుకుపోయిన పలువురు భారతీయులను మాస్కో సైన్యంలో పనిచేయించారని వార్తలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి మోదీ కూడా తన రష్యా పర్యటనలో ఇదే అంశాన్ని పుతిన్ ముందు ప్రస్తావించినట్టు సమాచారం.
అయితే, ఇప్పటికీ భారతీయ పర్యాటకులపై ఇలాంటి అన్యాయం జరుగుతుండటం గమనార్హం. అమిత్ తన్వర్ చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తమ పౌరుల హక్కులను కాపాడేలా భారత ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
