అబుదాబి, హనోయి, బాలి... భారతీయులు ఎక్కువగా వెళ్తున్న టాప్ 3 దేశాలు ఇవే!
ఈ నివేదిక ఆసియా-పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోని టాప్ 15 సమ్మర్ వేకేషన్ ప్లేస్ లలో ఎనిమిదింటికి నిలయంగా ఉందని పేర్కొంది.
By: Tupaki Desk | 17 May 2025 2:00 PM ISTగతేడాది భారతీయులు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో విదేశాలకు వెళ్లారని మాస్టర్‌కార్డ్ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్ (MEI) విడుదల చేసిన వార్షిక నివేదిక 'ట్రావెల్ ట్రెండ్స్ 2025' వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ పర్యాటకులు అనేక రకాల టూరిస్ట్ ప్లేసులను అన్వేషిస్తున్నారు. వాటిలో అబుదాబి, హనోయి, బాలి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్రదేశాలకు నేరుగా విమాన కనెక్టివిటీ ఉండడం, మధ్యతరగతి ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రయాణాలపై ఆసక్తి చూపడం దీనికి ప్రధాన కారణాలు.
ఈ నివేదిక ఆసియా-పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోని టాప్ 15 సమ్మర్ వేకేషన్ ప్లేస్ లలో ఎనిమిదింటికి నిలయంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, అభిరుచులు, లక్ష్య-ఆధారిత ప్రేరణలు(Goal-oriented motivations) టూరిస్ట్ ఇండస్ట్రీని నడిపించే బలమైన శక్తులుగా ఉన్నాయని తెలిపింది. భౌగోళిక రాజకీయాలు, మారకపు రేట్లు కూడా పర్యాటకుల ప్రవర్తనను ప్రభావితం చేయగలవని నివేదిక పేర్కొంది.
టోక్యో, ఒసాకా వేసవి ప్రయాణానికి (జూన్-సెప్టెంబర్ 2025 మధ్య) ప్రపంచంలోని టాప్ 2 ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలిచాయి. గత స్థాయిలతో పోలిస్తే ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. 2023లో రెండో స్థానంలో ఉన్న టోక్యో, 2024లో మొదటి స్థానానికి ఎగబాకింది. పీక్ వేసవి సీజన్‌లో పర్యాటకుల్లో ఈ ప్రాంతానికి ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. వియత్నాంలోని నా ట్రాంగ్ అందమైన బీచ్‌లు, అద్భుతమైన తీరప్రాంతం, సందడిగా ఉండే రాత్రి జీవితంతో ఆశ్చర్యకరంగా ఈ జాబితాలోకి ప్రవేశించింది.
2024లో చాలా కాలం పాటు యెన్ బలహీనంగా ఉండటం జపాన్ పర్యాటక రంగానికి గణనీయమైన ఊతమిచ్చిందని నివేదిక తెలిపింది. ఇది దేశాన్ని సందర్శకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చింది. పర్యాటకులు సాధారణ సందర్శనల కంటే భోజనం, ప్రకృతి, ఆరోగ్యం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది. మంచి అనుభవాల కోసం వారు ఆసక్తి చూపుతున్నారు. ఇండోనేషియాలోని బాలిలో ప్రసిద్ధ బాబి గులింగ్ ( spit-roasted pork)కు పేరుగాంచిన గియానార్, న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్ ప్రపంచ స్థాయి ఆహార హాట్‌స్పాట్‌లుగా నిలిచాయని నివేదిక పేర్కొంది.
క్రీడా పర్యాటకం కూడా నిలకడగా పెరుగుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, లాస్ ఏంజిల్స్‌లోని బేస్‌బాల్ ప్రపంచ సిరీస్ గణనీయ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాయి. షోహీ ఒహ్తాని ప్రపంచ సిరీస్‌లో అరంగేట్రం చేయడంతో జపాన్ నుంచి వచ్చిన పర్యాటకుల సంఖ్య ఏకంగా 91శాతం పెరిగింది. ఇది క్రీడలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. భారతీయుల్లో పెరుగుతున్న విదేశీ ప్రయాణాల ధోరణి దేశ ఆర్థికాభివృద్ధికి కూడా సూచికగా నిలుస్తోంది.
