పాఠాలు చెప్పేందుకు టీచర్ వినూత్న ప్రయత్నం.. దేశం దృష్టి అతనిపైనే
పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, విశేషమైన ప్రయోగశాలలు, కోట్ల రూపాయల పెట్టుబడులు సాధారణంగా ‘ఆవిష్కరణ’ అంటే మనకు గుర్తొచ్చేది ఇవే.
By: Tupaki Desk | 29 Nov 2025 6:00 PM ISTపెద్ద పెద్ద టెక్ కంపెనీలు, విశేషమైన ప్రయోగశాలలు, కోట్ల రూపాయల పెట్టుబడులు సాధారణంగా ‘ఆవిష్కరణ’ అంటే మనకు గుర్తొచ్చేది ఇవే. కానీ ఓ చిన్న గ్రామంలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి తన గదిలో కూర్చుని, కేవలం ఇష్టంతో, ఆసక్తితో, ప్రయోగాలపై పిచ్చితో తయారు చేసిన రోబోట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ విద్యార్థి పేరు ఆదిత్య.. అతని కల్పనకు రూపం ‘సోఫీ’ ఒక్కసారిగా ఈ కథనం ఒక చిన్నారి ప్రతిభ గురించికాదు.. మొత్తం భారత విద్యా వ్యవస్థ ఎదురుచూస్తున్న ఒక కొత్త మార్గదర్శక సంకేతంగా మారింది.
భవిష్యత్ వాటిదే కానుందా..?
యూపీ బులంద్‌షహర్‌కు చెందిన ఆదిత్య కుమార్ ఇంటర్ చదువుతున్న వయసులోనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు అని నిరూపించాడు. ఎల్ఎల్ఎమ్ చిప్‌సెట్‌తో పనిచేసే ఒక పూర్తి స్థాయి ఏఐ టీచర్ రోబోట్‌ను రూపొందించి, దానికి ‘సోఫీ’ అనే పేరు పెట్టాడు. ఈ రోబోట్ కేవలం కదిలే పరికరం కాదు.. ఇది స్వయంగా పరిచయం చేసుకుని, పిల్లలకు బోధిస్తుంది, ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రత్యేక శిక్షణా సాధనం. ‘నేను సోఫీ.. బులంద్‌షహర్‌లోని శివ్‌చరన్ ఇంటర్ కాలేజీలో బోధిస్తున్నాను’ అని సామాజిక మాధ్యమాల్లో చెప్పిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
కేవలం రూ. 25వేలకే రోబో..
ఆదిత్య దీనిని సుమారు రూ.25 వేలే ఖర్చు పెట్టాడు. ఈ మొత్తం ఒక పెద్ద సంస్థకు చిల్లర అయి ఉండొచ్చు, కానీ ఒక విద్యార్థి తక్కువ ఖర్చుతో, సొంత పద్ధతిలో ఇంత పెద్ద ఆవిష్కరణను చేయడం అసాధారణం. తమిళ సినిమా ‘రోబో’ నుంచి ప్రేరణ పొంది సంవత్సరాల ప్రయత్నంతో సోఫీ రూపుదిద్దుకుంది. సోఫీ ఉన్నత స్థాయి విద్యను అందించే ప్రొఫెషనల్ ఏఐ సిస్టమ్ కాదు.. కానీ దానికి ఇది ఏమాత్రం తీసిపోదు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పేరు చెప్పగలదు. ప్రాథమిక గణిత గణనలు చేయగలదు. ‘విద్యుత్ అనేది చార్జ్‌డ్ పార్టికిల్స్ కదలికతో ఏర్పడిన శక్తి’ అని చిన్నారులుకు వివరిస్తుంది. బోధనా పాఠాలను అర్థవంతంగా అందిస్తుంది. ఒక విద్యార్థి చేతుల్లో తయారైన రోబోట్‌కి ఇది చిన్న విషయం కాదు.. ఈ జ్ఞానం ఒక గ్రామం తరగతి గదిలోకి అడుగుపెట్టిన సాంకేతిక విప్లవం.
అయితే, సోఫీ కథ కేవలం సాంకేతిక విజయమే కాదు.. అది భారత గ్రామీణ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రత్యామ్నాయ ప్రతిపాదన. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత. సరైన టీచర్లు పట్టణాలకు వెళ్లిపోవడం. విద్యార్థులు పాఠ్యాంశాు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులు వీటన్నింటికి టెక్నాలజీ ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆదిత్య కూడా అదే చెబుతున్నాడు. ‘గ్రామీణ ప్రాంతాలలో ఉపాధ్యాయుల కొరతను వీటితో తగ్గించొచ్చు’ అంటున్నాడు.
సోఫీ రాయడం, నోట్స్ తయారు చేయడం వంటి సామర్థ్యాలు కూడా భవిష్యత్తులో రానున్నాయని ఆదిత్య చెబుతున్నాడు. అంటే, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. ఇది ఒక ప్రయోగశాల, ఒక పిల్లవాని చేతుల్లో పుట్టిన విప్లవం. ఇదే సమయంలో, యువ ఆవిష్కర్తల కోసం పరిశోధనా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరడం ఒక పెద్ద సందేశం.
టీచింగ్ లో ఏఐ..
ఈ కథ మనకు ముఖ్యమైన విషయాను బోధిస్తోంది. ఏఐ బోధనలో కూడా అడుగు పెడుతుంది.. అంటే టీచర్ల పాత్ర తగ్గిపోతుంది అన్న అపోహలు ఉన్నా, సోఫీ చెప్పిన సమాధానాలు చూసినప్పుడు స్పష్టం అవుతుంది. మంచి బోధన అంటే మానవ సంబంధం+సాంకేతిక సాయం. రెండూ కలిసి ఉంటేనే భవిష్యత్తు పాఠశాలలు బలపడతాయి.
ఆదిత్య కథ ఒక చిన్నారి కల, ఒక ఇల్లు, ఒక గ్రామం దాటిపోయి ఇప్పుడు మొత్తం దేశానికి ప్రేరణగా నిలిచాడు. ప్రతిభ కేవలం నగరాల్లోనే కాదు.. మన ఊళ్లలో, మన ఇంట్లో, మన పిల్లల్లో దాగి ఉంది. కనుక పాలసీ మేకర్లు, విద్యా వ్యవస్థ, సమాజం ఇప్పుడు ఈ ప్రతిభను వెలికి తీసే సమయం వచ్చింది. సోఫీ ఒక రోబోట్ కాదు.. అది భారత భవిష్యత్తు తరగతి గదిలో వినిపించే తొలి అడుగు శబ్దం.
