వైరల్ : యూఎస్ఏ ఎఫ్1 వీసా స్టూడెంట్స్ మీద మీమ్ వీడియోస్
ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాలే అని విశ్లేషకులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 25 July 2025 6:00 AM ISTఒకప్పుడు అమెరికాలో చదవాలనే కల లక్షలాది మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది 2024లో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం అమెరికాకు వెళ్లే ఎఫ్1 వీసా విద్యార్థులతో కిక్కిరిసిపోయేది. వేలాది మంది యువత ట్రాలీ బ్యాగులతో, చేతుల్లో పాస్‌పోర్టులతో, కుటుంబ సభ్యుల వీడ్కోలు మధ్య ఉద్వేగంతో కనిపించేవారు. ఈ దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
కానీ 2025 నాటికి ఈ దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థుల రద్దీ దాదాపుగా కనబడటం లేదు. ఈ ఆకస్మిక మార్పు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పాత వీడియోలను, ప్రస్తుత ఖాళీ విమానాశ్రయ దృశ్యాలను పోలుస్తూ ఫన్నీ మీమ్‌లు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
-ట్రంప్ పాలసీలే ప్రధాన కారణం
ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ట్రంప్ తన పాలనలో విదేశీ విద్యార్థులు, వలసదారులపై అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హెచ్1బీ, ఎఫ్1 వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. వీసా పొందడం కష్టంగా మారింది. ఒకవేళ వీసా లభించినా, అమెరికాలో స్థిరంగా ఉండటం, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించడం వంటి విషయాల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అంతేకాకుండా, అమెరికాలో విద్య ఇప్పటికే చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకు ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. పైగా అమెరికాలో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం ఇతర జాబ్స్ చేయకుండా ట్రంప్ కఠిన నిబంధనలు పెట్టారు. భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి, భయం కారణంగా చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదివే ఆలోచనను విరమించుకుంటున్నారు.
- వైరల్ మీమ్స్ వెనుక ఆవేదన
నెటిజన్లు రూపొందించిన మీమ్స్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పాత వీడియోలలోని "అన్నా నేనూ వచ్చేస్తున్నా" వంటి డైలాగులు, ట్రాలీలతో పరుగులు తీస్తున్న విద్యార్థుల దృశ్యాలను, ఇప్పుడు ఖాళీగా ఉన్న విమానాశ్రయ చిత్రాలతో పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని మీమ్స్‌లో "2024: Tirupati Darshan లా USA కోసం క్యూ..." అని ఉండగా, "2025: ఎయిర్‌పోర్ట్ కంటే బస్‌స్టాండ్ లోనే జనం ఎక్కువగా ఉన్నారు!" వంటి కామెంట్లు ఈ పరిస్థితిని హాస్యాస్పదంగా, ఆలోచింపజేసేలా చిత్రీకరిస్తున్నాయి.
ట్రంప్ పాలసీల ప్రభావంతో విదేశీ వీసా విధానాలు ఎంత సున్నితంగా ఉంటాయో మరోసారి రుజువైంది. ఒకప్పుడు అమెరికా వెళ్లేందుకు పోటీ పడిన భారతీయ విద్యార్థులు, ఇప్పుడు ఆ దిశగా ఒక్క అడుగు వేయడానికి కూడా వెనకాడుతున్నారు. ఇది భారతీయ విద్యార్థుల 'మైగ్రేషన్ మైండ్‌సెట్' లో వచ్చిన ఒక పెద్ద మార్పును సూచిస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు భద్రత, స్థిరత్వం ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.
