Begin typing your search above and press return to search.

యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ స్కామ్‌..రూ.4.2 లక్షలు పోగొట్టుకున్న భారతీయ విద్యార్థిని!

శ్రేయాను నమ్మించేందుకు ఆ వ్యక్తి తన పేరు, బ్యాడ్జ్ నంబర్‌ను చెప్పి, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్లో తన గురించి చూడొచ్చని సూచించాడు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:09 PM IST
యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ స్కామ్‌..రూ.4.2 లక్షలు పోగొట్టుకున్న భారతీయ విద్యార్థిని!
X

అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నారు. అనేక ఆటుపోట్లు వారి యూఎస్ కలలను ప్రమాదంలో పడేస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక ఘటనలో ఒక భారతీయ విద్యార్థినిని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు 5,000 డాలర్లు (సుమారు రూ.4.29లక్షలు)వసూలు చేశారు. యూఐ డిజైనర్, మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న శ్రేయా బేడి అనే విద్యార్థిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా నటిస్తూ ఆమెను కొందరు వ్యక్తులు మోసగించారు. శ్రేయా బేడి 2022లో ఎఫ్-1 వీసాతో అమెరికాకు వచ్చి బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్సిటీలో హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.

మే 29న శ్రేయాకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా చెప్పుకున్నాడు. ఆమె తన అడ్మినిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించావని నమ్మించాడు. అరెస్ట్ చేసి, దేశం నుంచి బహిష్కరించకుండా ఉండాలంటే బాండ్ పేమెంట్స్ కోసం 5,000 డాలర్ల విలువైన గిఫ్ట్ కార్డ్‌లను కొనుగోలు చేయాలని ఆమెకు సూచించాడు. చట్టాల ఉల్లంఘన, దాని పరిణామాలకు శ్రేయా భయపడి ఆమె ఆవేదన చెందింది.

శ్రేయాను నమ్మించేందుకు ఆ వ్యక్తి తన పేరు, బ్యాడ్జ్ నంబర్‌ను చెప్పి, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్లో తన గురించి చూడొచ్చని సూచించాడు. ఆమె చెక్ చేయగా ఆ ఫోన్ నంబర్ మేరీల్యాండ్‌లోని ఒక చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసుకు చెందినది అని గుర్తించింది.తరువాత, ఆమెకు ఒలింపియా పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి మరొక నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి యాక్టివ్ అరెస్ట్ వారెంట్ ఉందని ఆమెను బెదిరించాడు.

అయితే, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెప్పే వరకు ఆమె కేసులో విచారణలో ఉందని నమ్మబలికాడు. ఆ వ్యక్తి శ్రేయాను ఫోన్‌లోనే ఉండమని, ఎవరినీ సంప్రదించవద్దని, ఆమె ఫోన్ నిఘాలో ఉందని హెచ్చరించాడు. అలా ఆమెను మూడు గంటల పాటు ఫోన్ లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు.

మోసగాళ్లు చెప్పినట్లు ఆమె 5,000 డాలర్ల విలువైన ఆపిల్, టార్గెట్ గిఫ్ట్ కార్డ్‌లను కొనుగోలు చేసి ఫోన్‌లోనే కోడ్‌లను వారితో పంచుకుంది. మరుసటి రోజు ఒక పోలీసు అధికారి కార్డ్‌లను, బాండ్ పేపర్‌లను సేకరించడానికి వస్తారని చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ మరుసటి రోజు శ్రేయా ఇంటికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత తన ఫ్రెండ్‎తో మాట్లాడిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇలాంటి స్కామ్ కథల గురించి తెలుసుకుని తాను మోసపోయానని శ్రేయా బేడి గ్రహించింది.ఈ ఘటన తర్వాత తాను పూర్తిగా కుంగిపోయినట్లు ఆమె వాపోయింది.