Begin typing your search above and press return to search.

విద్యార్థిపై యూఎస్ అమానుషం.. మన కాన్సులేట్ ఆ పనిలో బిజీ!

తప్పు చేసినోళ్లకు తక్షణ శిక్ష వేయాల్సిందేనా? చట్ట ప్రకారం శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:36 AM IST
విద్యార్థిపై యూఎస్ అమానుషం.. మన కాన్సులేట్ ఆ పనిలో బిజీ!
X

తప్పు చేసినోళ్లకు తక్షణ శిక్ష వేయాల్సిందేనా? చట్ట ప్రకారం శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి. అవి చేయాల్సిన పనుల్ని అధికారులు ఎందుకు చేస్తున్నారు? మానవ హక్కులు.. మానవ హక్కులు అంటూ అదే పనిగా నోరేసుకొని మాట్లాడే అమెరికా.. తన దేశంలోకి ప్రవేశించే వారిపై వ్యవహరించే అమానుష పద్దతి వేళ.. ఇవేమీ గుర్తుకు రావా? భారత విద్యార్థి ఒకరిని నెవార్క్ ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అమానుషంగా అతడ్ని నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించిన వైనం తెలిసిందే.

దీనిపై తక్షణమే స్పందించాల్సిన భారత కాన్సులేట్.. సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయ్యాక కానీ రియాక్టు కాలేదు. రియాక్టు అయ్యే విషయంలో కాస్త ఆలస్యం అయ్యిందనే అనుకుందాం. లేటుగా స్పందించినా..లేటెస్టుగా రియాక్టు అయ్యారా? అంటే అదీ లేదు. వివరాలు సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎంత కాలం వరకు వివరాలు సేకరిస్తూ ఉంటారు? అగ్రరాజ్యం అమానుష తీరును వేలెత్తి చూపించేందుకు చిన్నపాటి ధైర్యాన్ని ప్రదర్శించకపోవటం దేనికి నిదర్శనం?

మరోవైపు భారత్ లో ఉన్న అమెరికా కాన్సులేట్ మాత్రం సోషల్ మీడియాలో నీతులు చెప్పటం షురూ చేసింది. తమ దేశానికి వచ్చే చట్టబద్ధమైన ప్రయాణికుల్ని అమెరికా స్వాగతిస్తూనే ఉంటుందని.. అమెరికాలో ప్రవేశమన్నది హక్కు కాదంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. అక్రమ చొరబాట్లు.. వీసాల దుర్వినియోగం.. యూఎస్ చట్టాల ఉల్లంఘనల్ని సహించేది లేదని ముఖం మీద కొట్టొచ్చినట్లుగా ప్రకటనలు చేస్తున్నప్పుడు.. కనీస మర్యాద.. మానవత్వం అన్నది ప్రదర్శించరా? అని ప్రశ్నించేటోడు ఒక్కడంటే ఒక్కడు లేకపోవటమే ఈ మొత్తం ఎపిసోడ్ లో వేదన కలిగించే అంశం.

అగ్రరాజ్యం గొప్పదే కావొచ్చు. కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే అహంకారాన్ని భరించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. భారత్ లోని అమెరికా కాన్సులేట్ జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు కానీ.. తమ చర్యల్ని సమర్థించుకోవటానికి వెనుకాడలేదు. అదే సమయంలో న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ మాత్రం.. సదరు ఘటనకు సంబంధించిన విద్యార్థి వివరాల్ని సేకరిస్తూన్నట్లుగా పేర్కొంది. ఇంకెంతకాలం వివరాల్ని సేకరిస్తూ ఉంటారో..? మోడీ హయాంలోనూ ఇలా జరగటం దేనికి నిదర్శనం?