అమెరికాలో భారతీయ విద్యార్థిపై అమానుషం.. కదిలిస్తున్న వీడియో
అమెరికాలో భారతీయ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిన ఒక ఘటన న్యూయార్క్‌లోని విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 10 Jun 2025 9:59 AM ISTఅమెరికాలో భారతీయ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిన ఒక ఘటన న్యూయార్క్‌లోని విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఒక భారతీయ విద్యార్థిని అమెరికా నుండి బహిష్కరిస్తూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటన అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.., ఆ భారతీయ విద్యార్థిని చేతులకు సంకెళ్లు వేసి, క్రిమినల్ లాగా వ్యవహరించారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నా సరే ఆ విద్యార్థి వేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఒక ప్రవాస భారతీయుడు ట్వీట్ చేశారు. "నిన్న రాత్రి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ యువ భారత విద్యార్థిని డిపోర్ట్ చేస్తూ చూశాను. చేతులకు హ్యాండ్‌కఫ్స్ వేసి, ఏడుస్తూ, క్రిమినల్‌లా తీసుకెళ్లారు. అతడు కలలు కంటూ వచ్చాడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని ఊహించలేదు అని వాపోయాడు.. ఒక ప్రవాస భారతీయునిగా నేను ఆ పరిస్థితిని చూసి నా హృదయం బాధతో నిండిపోయింది" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ వీడియో ఇప్పుడు భారతీయ వలసదారుల హృదయాలను కలచివేస్తోంది. దేశం విడిచి లక్షల ఆశలతో వెళ్ళిన యువ విద్యార్థులు ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడం విచారకరం. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానాల ఫలితంగానే ఇటువంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు చూపుతున్న కఠినత్వం మానవతా విలువలకు విరుద్ధంగా ఉందని, ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ఘటన కాదని, భారత విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అంశమని ప్రజలు భావిస్తున్నారు. అత్యధికంగా వీసా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యంగా ప్రవర్తించే అధికారులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా, విద్యార్థులు తమ వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, విదేశాల్లో భారతీయుల హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వంపై కూడా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.