Begin typing your search above and press return to search.

ట్రంప్ దుర్మార్గాలకు అంతే లేదా? హార్ముజ్ జలసంధిలో అమెరికా దాడి.. ముగ్గురు భారతీయ నావికుల ఘోర మృతి!

మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్న సైనిక దుశ్చర్యలు చివరకు అమాయక భారతీయ కుటుంబాలలో తీరని చీకట్లను నింపాయి.

By:  A.N.Kumar   |   12 Jun 2026 12:08 AM IST
ట్రంప్ దుర్మార్గాలకు అంతే లేదా? హార్ముజ్ జలసంధిలో అమెరికా దాడి.. ముగ్గురు భారతీయ నావికుల ఘోర మృతి!
X

మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్న సైనిక దుశ్చర్యలు చివరకు అమాయక భారతీయ కుటుంబాలలో తీరని చీకట్లను నింపాయి. ఇరాన్‌తో ఉన్న రాజకీయ వైరాన్ని మనసులో పెట్టుకుని.. అంతర్జాతీయ జలాల్లో అమెరికా జరిపిన ఒకే ఒక్క దాడి ముగ్గురు భారతీయ నావికుల ప్రాణాలను బలితీసుకుంది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిలటరీ జరిపిన అనాగరిక దాడిలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారికంగా ధృవీకరించారు. ఈ దారుణ ఘటన సముద్ర రంగంలో పనిచేస్తున్న వేలాది మంది నావికుల భద్రతను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

పెళ్లి రోజు వేడుక చూసుకోకుండానే.. అనంత లోకాలకు విశాఖ ఇంజనీర్!

ఈ అమెరికా దాడి వెనుక ఉన్న నిర్లక్ష్యం, క్రూరత్వం ఎంతటిదో మృతుల కుటుంబాల రోదనలు చూస్తే అర్థమవుతుంది. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.

గుండెల్ని పిండేసే ఉదంతం

సురేష్ తన విధి నిర్వహణ ముగించుకుని, ఒమన్ నుండి తిరిగి భారతదేశానికి రావాల్సి ఉంది. ఈ నెల 24న ఆయన వివాహ వార్షికోత్సవం. తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఎంతో ఘనంగా ఆ రోజును జరుపుకోవాలని ఎన్నో ఆశలతో ప్రణాళికలు వేసుకున్నారు. కానీ, అమెరికా దాడి రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. భర్త తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూసిన భార్యకు, తండ్రి ప్రేమకు నోచుకోకుండా పోయిన ఇద్దరు పిల్లలకు అమెరికా పాలకులు ఏం సమాధానం చెబుతారు?

సురేష్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా కూడా ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. మొదట్లో వీరు ముగ్గురూ గల్లంతైనట్లు భావించినప్పటికీ తీవ్ర గాలింపు చర్యల తర్వాత వారి మృతదేహాలు లభ్యమవడంతో విషాదం మరింత ముదిరింది.

అసలు అమెరికా ఎందుకు దాడి చేసింది?

అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన వివరణ ప్రకారం.. ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ నౌక చమురు రవాణా చేస్తోందనే అనుమానంతోనే తాము ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. కేవలం ఒక 'అనుమానం' ఆధారంగా ఒక వాణిజ్య నౌకపై క్షిపణులు, బాంబులతో దాడి చేయడం ఏ రకమైన న్యాయం? అని అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తోంది. నౌక నిర్వాహకులు కూడా అమెరికా ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, ఈ ఘటనపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత్ తీవ్ర ఆగ్రహం.. అధికారిక నిరసన

ఈ ఘోరంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేసింది. సముద్ర రవాణా రంగంలో రాత్రింబగళ్లు కష్టపడే భారతీయ నావికుల రక్షణ మాకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తూ, అమెరికా అధికారులకు భారత్ అధికారికంగా తన నిరసనను తెలియజేసింది. ఇలాంటి ఏకపక్ష దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. నౌకలో ఉన్న మిగిలిన 21 మంది భారతీయులను విదేశాంగ శాఖ సమన్వయంతో సురక్షితంగా రక్షించగలిగారు.

అంతర్జాతీయ వాణిజ్యానికి పొంచి ఉన్న ముప్పు

ట్రంప్ ప్రభుత్వ హయాంలో మధ్యప్రాచ్యంలో అమెరికా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, మిలటరీ చర్యలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి శాపంగా మారుతున్నాయి. హార్ముజ్ జలసంధి లాంటి కీలకమైన సముద్ర మార్గాల్లో ఇటువంటి దాడులు జరిగితే వేలాది మంది అమాయక నావికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారక తప్పదు. అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అమెరికా తన తప్పును ఒప్పుకుని, మరణించిన నావికుల కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.