జపాన్ నుంచి భారతీయుడి బహిష్కరణ.. వైరల్ వీడియో వెనుక కన్నీటి కథ
మూడు దశాబ్దాలుగా ఒక దేశాన్ని నమ్ముకుని, అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించిన ఒక భారతీయ వ్యాపారవేత్తను అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్లమనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
By: A.N.Kumar | 28 May 2026 4:31 PM ISTప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ కష్టపడి పనిచేసే స్వభావం, ప్రతిభ, వ్యాపార నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, మధ్యప్రాచ్యం నుంచి జపాన్ వరకు ఎన్నో రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలు, అనిశ్చితి తరచూ మనసును కలచివేస్తుంటాయి. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అలాంటి బాధాకరమైన పరిస్థితిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
మూడు దశాబ్దాలుగా ఒక దేశాన్ని నమ్ముకుని, అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించిన ఒక భారతీయ వ్యాపారవేత్తను అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్లమనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
30 ఏళ్ల శ్రమ.. ఒక్క నిర్ణయంతో రోడ్డున!
జపాన్‌లో 30 సంవత్సరాలుగా నివసిస్తూ, సైతామా ప్రిఫెక్చర్‌లో 18 ఏళ్లుగా విజయవంతంగా ఇండియన్ కర్రీ రెస్టారెంట్ నిర్వహిస్తున్న భారతీయ వ్యాపారవేత్త మనీష్ కుమార్‌కు జపాన్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 2025లో కఠినతరం చేసిన వీసా నిబంధనల కారణంగా ఆయన ‘బిజినెస్ మేనేజర్ వీసా’ రీన్యువల్‌ను జపాన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ తిరస్కరించింది. దీంతో దశాబ్దాలుగా తాను నిర్మించుకున్న జీవితాన్ని, వ్యాపారాన్ని వదిలేసి ఆయన జపాన్ విడిచిపెట్టాల్సిన కఠిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టోక్యోలో జరిగిన ఒక నిరసన ర్యాలీలో మనీష్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
"నా పిల్లలు ఇక్కడే పుట్టారు. వాళ్లకు జపనీస్ భాష, సంస్కృతి మాత్రమే తెలుసు. వాళ్ల స్నేహితులంతా జపనీయులే. ఇప్పుడు ఒక్కసారిగా మమ్మల్ని తిరిగి ఇండియాకు వెళ్లమంటే అది ఎలా మానవత్వం అవుతుంది? నేను ఎలాంటి నేరం చేయలేదు. నా వంతుగా కష్టపడి పన్నులు కట్టాను. ఇదేనా మాకు దక్కే న్యాయం?" అంటూ ఆయన వ్యక్తంచేసిన ఆవేదన విన్నవారిని కదిలిస్తోంది.
నిబంధనల మార్పే శాపమైందా?
జపాన్ ప్రభుత్వం 2025లో వ్యాపార వీసాల కోసం అవసరమైన కనీస మూలధన పరిమితిని నిబంధనలను భారీగా మార్చడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ ఆకస్మిక మార్పుతో చిన్న ,మధ్య తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అక్కడ రెస్టారెంట్లు, చిన్న దుకాణాలు నడుపుకుంటున్న భారతీయుల వంటి వలస వ్యాపారులు ఈ కొత్త నిబంధనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సేవ చేసి, క్రమబద్ధంగా పన్నులు చెల్లించి, స్థానిక సమాజంలో భాగమైన వ్యక్తులను ఇలా రాత్రికి రాత్రే వెళ్లగొట్టడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది.
అంతర్జాతీయంగా మారుమోగుతున్న వలసదారుల ఆవేదన
ఈ ఘటన ఒక్క మనీష్ కుమార్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. విదేశాల్లో జీవిస్తున్న వేలాది మంది భారతీయుల అంతర్గత మనోవేదనకు ఇది ప్రతీకగా మారింది. భారతీయులు తమ శ్రమ, ప్రతిభతో ప్రపంచ దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నా.. చట్టాలు, నిబంధనల పేరుతో వారికి కనీస మానవత్వం, భద్రత లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మనీష్ కుమార్ కన్నీటి వీడియో ఇప్పుడు కేవలం ఒక వైరల్ క్లిప్ కాదు.. అది విదేశాల్లో వలసదారులు ఎదుర్కొంటున్న చట్టపరమైన అస్థిరతకు, వారి భావోద్వేగ పోరాటానికి నిలువెత్తు ప్రతిబింబం. ఈ నిబంధనలపై జపాన్ ప్రభుత్వం పునరాలోచించాలని, దశాబ్దాలుగా దేశంలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో మినహాయింపులు ఇవ్వాలని నెటిజన్లు, ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
