దేశంలో అతిపెద్ద ఆస్తులున్న సంస్థకు ఆదాయం ఎంతో తెలుసా?
రోజూ తెల్లవారకముందే కదిలే ఆ ఉక్కు బోగీలు.. రాత్రి అర్ధరాత్రి దాకా ఆగకుండా పరుగులు తీసే ఇంజిన్లు.. దేశాన్ని ఒక్క దారిలో కట్టిపడేసిన మహా వ్యవస్థ భారతీయ రైల్వే.
By: Tupaki Desk | 20 Dec 2025 5:00 PM ISTరోజూ తెల్లవారకముందే కదిలే ఆ ఉక్కు బోగీలు.. రాత్రి అర్ధరాత్రి దాకా ఆగకుండా పరుగులు తీసే ఇంజిన్లు.. దేశాన్ని ఒక్క దారిలో కట్టిపడేసిన మహా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇది కేవలం రవాణా సంస్థ కాదు. కోట్లాది జీవితాలకు ఇది ఆధారం, ఆశ, అవసరం. కానీ ఇంతటి విశాలమైన వ్యవస్థ వెనుక దాగి ఉన్న ఆర్థిక వాస్తవం మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. రోజుకు దాదాపు 2 కోట్ల మందిని వారి వారి గమ్య స్థానాలకు తరలిస్తున్న భారతీయ రైల్వేకు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. మిగిలిన వ్యవస్థ మొత్తం ప్రభుత్వ సబ్సిడీల మీద, క్రాస్ సబ్సిడీల మీదే నిలబడింది.
భారతీయ రైల్వేను అర్థం చేసుకోవాలంటే ముందు దీని సామాజిక పాత్రను చూడాలి. ఒక చిన్న గ్రామం నుంచి మహానగరం వరకు చేర్చే అవకాశం అదీ వేగంగా చేస్తుంది. ఈ వ్యవస్థతోనే రైతు తన పంటను మార్కెట్‌కు తరలించగలుగుతాడు. కూలీ పని కోసం వేరే రాష్ట్రానికి కార్మికులు వెళ్లగలుగుతాడు. విద్యార్థి చదువుకోడానికి, రోగి చికిత్స కోసం ప్రయాణించగలుగుతాడు. ఈ అందుబాటు ధరల ప్రయాణమే రైల్వే అసలు బలం. కానీ అదే బలం ఆర్థికంగా బలహీనతగా మారుతోంది.
టికెట్ ధరలు తక్కువగా ఉండడం వల్ల ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం పరిమితంగా ఉంది. అదే సమయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులు, ఇంధన వ్యయం, భద్రతా చర్యలు.. ఇవన్నీ నిరంతరం పెరుగుతున్నాయి. రైల్వేలో ఉద్యోగుల జీతాలకే భారీ మొత్తంలో ఖర్చవుతోంది. పైగా నష్టం కలిగించే ప్యాసింజర్ రైళ్లను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎందుకంటే రైల్వేను పూర్తిగా లాభనష్టాల కోణంలో చూడలేం. ఇది ఒక ప్రజాసేవా వ్యవస్థ.
టికెట్ లేని ప్రయాణాలు..
మరో పెద్ద సమస్య చోరీలు, టికెట్ లేకుండా ప్రయాణాలు. ప్రతి రోజు వేల మంది టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తుంటారు. చిన్నగా కనిపించే ఈ అలవాటు కలిసొస్తే కోట్ల రూపాయల నష్టంగా మారుతుంది. అంతేకాదు, రైల్వే ఆస్తుల ధ్వంసం, ట్రాక్‌లపై రాళ్లు వేయడం, స్టేషన్లలో విధ్వంసం.. ఇవన్నీ కూడా రైల్వే ఖజానాపై భారం మోపడమే అవుతుంది. ఈ నష్టాన్ని ఎవరూ వ్యక్తి గతంగా భరించరు. చివరకు ప్రభుత్వం, అంటే ప్రజల పన్నులే దానికి మూల్యం చెల్లిస్తాయి.
ఇంతటి భారీ వ్యవస్థ ఎప్పటికైనా లాభాల్లోకి రాగలదా? సమాధానం ‘అవును.. కానీ..’ అనే ఆగుతుంది. పూర్తిగా ప్రైవేట్ సంస్థలా రైల్వే నడవదు. కానీ సంస్కరణలు లేకుండా కొనసాగితే భారమే పెరుగుతుంది. సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటికీ రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. అదే సరుకు రవాణాను మరింత సమర్థవంతంగా మార్చడం, లాజిస్టిక్స్ హబ్‌లుగా స్టేషన్లను అభివృద్ధి చేయడం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం అవసరం.
ప్రయాణికుల విషయంలో కూడా కొత్త ఆలోచనలు అవసరం. లగ్జరీ రైళ్లు, ప్రీమియం సేవలు, డైనమిక్ ప్రైసింగ్ వంటి విధానాలు ఇప్పటికే కొంత మేర మొదలయ్యాయి. వీటిని జాగ్రత్తగా విస్తరించవచ్చు. అలాగే డిజిటలైజేషన్ ద్వారా టికెట్ లేకుండా ప్రయాణాలను తగ్గించడం, భద్రతను పెంచడం సాధ్యం. ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రయాణికుల బాధ్యత కూడా. రైల్వే లాభాల్లోకి రావాలంటే మరో కీలక అంశం ప్రజల వద్దే ఉంది.. ‘ప్రభుత్వదే కదా’ అనే నిర్లక్ష్యం వీడాలి. టికెట్ తీసుకోవడం, ఆస్తులను కాపాడుకోవడం, నిబంధనలు పాటించడం.. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా వ్యవస్థను నిలబెట్టే మూలస్తంభాలు. ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలి, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచాలి, అవినీతికి చెక్ పెట్టాలి. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి.
వ్యవస్థను మర్థంగా మార్చాలి..
భారతీయ రైల్వేను లాభాల్లోకి తేవడం అంటే టికెట్ ధరలు పెంచడమే కాదు. వ్యవస్థను సమర్థవంతంగా మార్చడం, వృథాను తగ్గించడం, సేవా నాణ్యతను పెంచడం. రైల్వే అనేది మన దేశానికి వెన్నెముక. ఆ వెన్నెముక బలంగా ఉండాలంటే ప్రభుత్వ పాలసీలతో పాటు ప్రజల సహకారం కూడా అంతే కీలకం. అప్పుడే రోజుకు రెండు కోట్ల మందిని మోసే ఈ మహా వ్యవస్థ… దేశాన్ని ఆర్థికంగా కూడా ముందుకు నడిపించగలదు.
