ట్రైన్ ఛార్జీలు పెరిగాయి.. మీ పర్సు మీద బరువు ఎంతంటే?
కొత్త సంవత్సరంలోని అడుగు పెట్టటానికి కాస్త ముందే.. కొత్తగా పెరిగిన ట్రైన్ టికెట్ ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడనుంది.
By: Tupaki Desk | 26 Dec 2025 2:00 PM ISTకొత్త సంవత్సరంలోని అడుగు పెట్టటానికి కాస్త ముందే.. కొత్తగా పెరిగిన ట్రైన్ టికెట్ ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడనుంది. కొత్త ఛార్జీలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో.. రైలు ప్రయాణాలు చేసే అందరి మీద భారం పడనుంది. అయితే.. ఇంతకూ ఎంత భారం పడుతుంది? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడున్న ప్రజారవాణాలో ట్రైన్ టికెట్ అత్యంత చౌకగా ఉన్న విషయం తెలిసిందే. ఇక.. కొత్తగా అమల్లోకి రానున్న కొత్త ట్రైన్ టికెట్ ఛార్జీల విషయానికి వస్తే సాధారణ తరగతి ప్రయాణికులకు 215 కి.మీ దూరం వరకు ఎలాంటి పెంపు ఉండదు. అంటే.. ఒక మోస్తరు దూరం ప్రయాణం వరకు పాత ఛార్జీలే వర్తిస్తాయి.
215 కి.మీ. తర్వాత ప్రతి కిలోమీటర్ కు పైసా చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. అదే సమయంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు.. అన్ని ఏసీ తరగతుల్లో మాత్రం ప్రతి కిలోమీటర్ కు 2 పైసలు చొప్పున టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. తాజా పెంపుతో ఈ ఏడాది (2025)లో ట్రైన్ టికెట్ చార్జీలు రెండుసార్లు పెరిగినట్లైంది. ఛార్జీల పెంపు ఈ ఏడాది జులైలో జరిగితే.. ఐదు నెలల వ్యవధిలో రెండోసారి పెరుగుతున్నాయి.
తాజాగా పెరిగే టికెట్ ఛార్జీలకు సంబంధించి కీలక అంశాల్ని చూస్తే..
- సెకండ్ క్లాస్ సాధారణ టికెట్లలో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపు లేదు.
- 216కి.మీ. నుంచి 750 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.5 పెంపు ఉంటుంది.
- 751కిమీ. నుంచి 1250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.10 పెరుగుతాయి.
- 1251 - 1750కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.15 పెంపు
- 1751 - 2250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.20 పెంపు అమల్లోకి వస్తుంది.
- స్లీపర్ క్లాస్.. ఫస్ట్ క్లాస్ సాధారణ టికెట్లకు ప్రతి కి.మీ. పైసా అదనంగా వసూలు.
- ఎక్స్ ప్రెస్ /మొయిల్ ట్రైన్లలో నాన్ ఏసీ.. ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి మీద ప్రతి కి.మీ.కు రూ.2 పైసల పెంపు
- ఏసీ కోచ్ లలో పెరిగే ధరల కారణంగా టికెట్ ధరల్లో వచ్చే మార్పు ఎంతన్నది లెక్క వేస్తే.. ఉదాహరణకు 500 కి.మీ. దూరానికి ప్రయాణం చేసే వారికి రూ.10 వరకు భారం పడుతుంది.
