ట్రైన్‌లో దుప్పట్ల దొంగలు... రూ.100+ కోట్లు లూటీ
ఏసీ టికెట్ తీసుకున్న వారి సౌకర్యార్థం రైల్వే శాఖ బెడ్ షీట్లు, దుప్పట్లు, పిల్లో, పిల్లో కవర్స్, ఫేస్ టవల్స్‌ను ఇవ్వడం జరుగుతుంది.
By: Ramesh Palla | 13 July 2026 3:37 PM ISTఇండియాలో ప్రభుత్వ ఆస్తులు ఏ స్థాయిలో లూటీ కి గురి అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని చోట్ల ప్రభుత్వానికి చెందిన ఆస్తులు నాశనం చేయడం లేదా దొంగిలించడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ ఆస్తుల కంటే ప్రభుత్వ ఆస్తులపై దొంగల కన్ను ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్తి దొంగతనం చేస్తే పెద్దగా పట్టించుకోరని, అదే సమయంలో కేసుల తీవ్రత కూడా పెద్దగా ఉండదని దొంగలు భావిస్తారేమో. అందుకే ప్రభుత్వానికి చెందిన ఏ వస్తువు అయినా దొంగతనంకు అనుకూలంగా ఉంది అనిపిస్తే వెంటనే దొంగిలించేందుకు దొంగలు రెడీగా ఉంటారు. ఇండియన్ రైల్వేలో దొంగతనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైల్లో దొంగలు ఉంటారని ప్రయాణికులను హెచ్చరిస్తూ ఉంటారు. ఆ ప్రయాణికులే దొంగలు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తాజా గణాంకాలు చూస్తే అర్థం అవుతుంది.
రైల్వేలో ఏసీ కోచ్ ప్రయాణాలు...
రైలులోని ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు బెడ్ రోల్స్ సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఏసీ టికెట్ తీసుకున్న వారి సౌకర్యార్థం రైల్వే శాఖ బెడ్ షీట్లు, దుప్పట్లు, పిల్లో, పిల్లో కవర్స్, ఫేస్ టవల్స్‌ను ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణికులు చాలా మంది తమ గమ్య స్థానం వచ్చిన సమయంలో దిగినప్పుడు వాటిని తమతో తీసుకు వెళ్తున్నారు. అవి ప్రభుత్వ ఆస్తి కదా, మమ్ములను ఎవరు అడుగుతారులే అనుకుంటారో లేదా టికెట్ పెట్టాం కదా, డబ్బు ఇచ్చాం కదా ఇవి మావి అనుకుంటారో తెలియదు కానీ పెద్ద ఎత్తున దుప్పట్లు, బెడ్ షీట్స్ ను ప్రయాణికులు లూటీ చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. తాజాగా ఒక సమాచార హక్కు చట్టం కార్యకర్త పిటిషన్ మేరకు ఇండియన్ రైల్వే అధికారులు ఈ లెక్కలను బయట పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయల మేరకు దొంగతనం జరిగినట్లు వెల్లడి అయింది.
సమాచార హక్కు చట్టం...
సమాచార హక్కు చట్టం నుంచి రైల్వే శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం 2022 నుంచి 2026 మే వరకు రైల్వే శాఖలో మొత్తంగా 1.27 కోట్ల వస్తువులు దొంగతనానికి గురి అయ్యాయి. అత్యధికంగా 46.54 లక్షల ఫేస్ టవల్ ను ప్రయాణికులు దొంగతనం చేశారు. ఫేస్ తూడ్చుకునేందుకు ఇచ్చిన టవల్స్ ను ప్రయాణికులు ఈజీగా తమ బ్యాగ్స్ లో పెట్టుకుని వెళ్లి పోతున్నారు. టవల్ ను దొంగతనం చేసే సమయంలో ఏ ఒక్కరికీ అనుమానం కూడా రాదు, అందుకే ఎక్కువ సంఖ్యలో టవల్స్ దొంగతనానికి గురి అయ్యాయి. ఆ తర్వాత 41 లక్షల బెడ్ షీట్లు సైతం దొంగతనంకు గురి అయ్యాయి. దాదాపు 13 లక్షల దుప్పట్లు దొంగతనానికి గురి అయ్యాయి అని అధికారులు చెప్పుకొచ్చారు. పిల్లో కవర్లు 23.6 లక్షలు దోపిడీకి గురి అయ్యాయి. నాలుగు సంవత్సరాల ఐదు నెలల కాలంలో ఈ భారీ మొత్తంలో దొంగతనాలు జరిగాయి. అయితే ఈ లెక్కలు కేవలం 54 డివిజన్లకు సంబంధించినవే, ఇండియన్ రైల్వే పూర్తిగా 69 డివిజన్లుగా ఉంటుంది. ఆ మొత్తం లెక్క తీస్తే సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
రైల్వే బెడ్ రోల్ దొంగతనం..
రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన, దొంగతనం చేసినా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అయినా కూడా ప్రయాణికులు భయం లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు తెలియక తీసుకు వెళ్తే, కొందరు కావాలని తీసుకు వెళ్లే వారు ఉన్నారు. ప్రయాణికులు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ తల పట్టుకుంది. ప్రైవేట్ సంస్థలు ఈ బెడ్ షీట్లు, దుప్పట్లు రైల్వేలో సప్లై చేస్తూ ఉంటారు. వారిపై ఈ భారం పడుతుందని అధికారులు అంటూ ఉంటే, వారు ఏదో ఒక రూపంలో రైల్వే శాఖ పైనే ఈ భారం ను వేస్తారని అంటున్నారు. మొత్తానికి ప్రజల సొమ్ము ఇలా లూటీ అవుతుంది. రాజస్థాన్‌లోని బికానెర్ లో అత్యధికంగా బెడ్ రోల్స్ మాయం అయినట్లుగా వెళ్లడి అయింది. తిరుచిరాపల్లి మరియు పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క దొంగతనం నమోదు కాలేదు.
