కరాచీ పోర్టులో భారత్ దీపావళి... 1971లో ఏమి చేసిందో తెలుసా?
పాక్ పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 9 May 2025 9:14 AM ISTపాక్ పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ లోని లాహోర్ తో పాటు పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేసిందని.. ఇస్లామాబాద్ లోని ప్రధాని ఇంటికి సమీపంలో బాంబు దాడులు జరిగినట్లు చెబుతోన్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ నేవీ ఫుల్ టైమ్ డ్యూటీ ఎక్కినట్లు కనిపిస్తుంది.
అవును... తమ దేశంలోని పర్యాటకులపై దాడి చేశారనే కారణంతో ఉగ్రవాదులపై భారత్ దాడిచేస్తే.. తమ అమాయకులైన అమరవీరులపై దాడి చేశారని పాక్ తుత్తర పనికి తెరలేపింది! ఇందులో భాగంగా భారత్ పై అటు నియంత్రణ రేఖ, ఇటు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా దాడులకు ప్రయత్నించింది.. భారత్ తిప్పికొట్టింది.
ఈ సమయంలో తాజాగా పాకిస్థాన్ లోని కరాచీ ఓడరేవును భారత్ లక్ష్యంగా చేసుకుని సైనిక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి దక్షిణ పాకిస్థాన్ నగరమైన కరాచీలోని ఓడరేవును లక్ష్యంగా చేసుకుని భారత్ నేవీ బాంబుల వర్షం కురిపించిందని అంటున్నారు. ఈ మేరకు పలు నివేదికలు తెరపైకి వస్తున్నాయి.
ప్రాథమిక మీడియా నివేదికల ప్రకారం... కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పెద్ద పెద్ద పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. భారత నావికాదళం పాక్ లోని కీలక నావికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల తీరప్రాంతంలో పాక్ కు గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. పైగా... ఇక్కడే పాకిస్థాన్ ఇందన నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి!
కాగా... డిసెంబర్ 1971లో ఇండో – పాక్ యుద్ధ సమయంలో భారత నావికాదళం పాకిస్థాన్ లోని కీలక ఓడరేవు నగరమైన కరాచీలో రెండు సాహసోపేతమైన, చరిత్రలో నిలిచిపోయే దాడులను చేసింది. అందులో ఒకదాని పేరు ఆపరేషన్ ట్రైడెంట్ కాగా.. రెండోదాని పేరు ఆపరేషన్ పైథాన్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కరాచీపై ఇండియన్ నేవీ గాలి తగిలింది!
ఆపరేషన్ ట్రైడెంట్: ఈ దాడి 1971 డిసెంబర్ 4న జరిగింది. ఇందులో భాగంగా... ఐ.ఎన్.ఎస్. నిపత్, ఐ.ఎన్.ఎస్. నిర్ఘాత్, ఐ.ఎన్.ఎస్. వీర్ అనే క్షిపణి నౌకలను ఉపయోగించి రెండు జలతర్గామి కార్వెట్లతో కూడిన ఆకస్మిక దాడిని ప్రారంభించింది. ఈ దాడిలో రెండు పాకిస్థానీ డిస్ట్రాయర్లు మునిగిపోయాయి.
ఇదే సమయంలో కరాచీ చమురు నిల్వ సౌకర్యం తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ దాడితో వ్యాపించిన పేలుళ్లు, మంటలు సుమారు కొన్ని మైళ్ల వరకూ కనిపించాయి! అయితే.. ఈ భీకర దాడిలో భారత్ కు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఆపరేషన్ జ్ఞాపకార్ధమే డిసెంబర్ 4ను భారత నౌకాదళ దినోత్సవంగా పాటిస్తున్నారు.
ఆపరేషన్ పథాన్: ఈ దాడి ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన నాలుగు రోజులకు అంటే.. 1971 డిసెంబర్ 8న జరిగింది. ఇందులో భాగంగా.. ఐ.ఎన్.ఎస్. వినాష్, రెండు ఫ్రిగేట్లను ఉపయోగించి దాడి చేశారు. ఈ దాడిలో కరాచీ ఓడరేవు సమీపంలోని నౌకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రెండు దాడులతో యుద్ధం ముగిసే సమయానికి కరాచీ ఓడరేవు దాదాపు పనిచేయకుండా పోయింది.
