దేశంలో నిద్రలేని నగరాలెన్ని? హైదరాబాద్ పరిస్థితేంటి?
మహానగరాలు.. నగరాల్లోని ప్రజల జీవన విధానం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 19 March 2026 10:22 AM ISTమహానగరాలు.. నగరాల్లోని ప్రజల జీవన విధానం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కంటి నిండా కునుకు లేని బతుకు ఒక బతుకేనా? అన్న మాట తరచూ చాలామంది నోటి నుంచి వస్తూ ఉంటుంది.కానీ.. ఇలా అన్నోళ్లు సైతం కనుకు తీసే విషయంలో వ్యవహరించే తీరు మాటలకు భిన్నంగా ఉంటుంది. తాజాగా ఒక సర్వే నగరాల్లోని ప్రజల నిద్ర గురించి అధ్యయనం చేసింది. రిపోర్టులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురిచేసేలా.. హెచ్చరికలు జారీ చేసేలా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. దేశంలోని అన్ని మహానగరాలు.. నగరాల్లోని ప్రజల నిద్ర నాణ్యత అంతకంతకూ తగ్గుతుందన్న విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేసింది. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత అంతకంతకూ తగ్గటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే.. ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్ర లేచే విషయంలో స్పెషల్ రికార్డును క్రియేట్ చేయటం ఆసక్తికరంగా మారింది.
సరైన నిద్ర లేని కారణంగా మెదడు పనితీరు మాత్రమే కాదు.. మానసిక స్థిరత్వానికి నిద్ర అత్యవసరంగా చెబుతారు. నిద్ర తగ్గితే ఏకాగ్రత దెబ్బ తినటమే కాదు.. దీర్ఘకాలంలో గుండె జబ్బులు.. ఊబకాయం.. మధుమేహం.. ఆందోళన లాంటి సమస్యలు ఎదురవుతాయి. మారిన జీవనశైలి నిద్రలేమికి కారణమవుతోంది. ఈ సర్వేను 2025 జనవరి నుంచి 2026 మార్చి మధ్యకాలంలో నిర్వహించారు.
ముంబయి వాసుల్లో 76.5 శాతం మంది అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్నారు. దాదాపు 60 వాతం మంది పని వేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లుగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. నిద్ర విషయంలో దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే.. చెన్నై క్రమశిక్షణ కలిగిన సిటీగా చెప్పాలి. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు.
రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే చెడ్డ అలవాటున్న నగరాల్లో కోల్ కతా ముందుంది. ఇక్కడి ప్రజల్లో 75.5 శాతం మంది రాత్రి వేళ ఆలస్యంగా నిద్ర అలవాటు ఉన్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది. ఐటీ హబ్ గా పేర్కొనే గార్డెన్ సిటీ బెంగళూరులో 36.3 శాతం మంది అర్థరాత్రి దాటిన తర్వాత నిద్ర పోతున్నారు. నిద్ర లేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లుగా భావించటం లేదని పేర్కొనటం గమనార్హం. మన హైదరాబాద్ మహానగరానికి వస్తే.. మిగిలిన మెట్రో సిటీస్ తో పోలిస్తే కాస్తంత మెరుగ్గా ఉందని చెప్పాలి.
హైదరాబాద్ మహానగరంలోని 42 శాతం మంది ఆలస్యంగా నిద్ర పోతుండగా.. 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. స్లీప్ విషయంలో హైదరాబాద్ బ్యాలెన్స్ డ్ స్లీపర్ సిటీగా పేర్కొంటారు. భారతీయుల నిద్రకు దూరం కావటానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనంగా సర్వే వెల్లడించింది. దాదాపు 87.6 శాతం మంది భారతీయులు నిద్రపోవటానికి ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లుగా తేల్చారు. సోషల్ మీడియా.. ఓటీటీలు నిద్ర నాణ్యతను దెబ్బ తీస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అలవాట్ల కారణంగా సుమారు 57.8 శాతం మంది ఆఫీసుల్లో పని చేస్తున్నప్పుడు నిద్ర వస్తోందని వాపోవటం గమనార్హం.
మరో సర్వే ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు ఆరు గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి పది గంటల కంటే ముందే నిద్రపోయేవారు కేవలం 12 శాతంగా ఉన్నట్లు తేల్చారు. మంచి నిద్ర కోసం రాత్రి వేళ స్క్రీన్ టైం తగ్గించాలని.. సరైన సమయానికి భోజనం చేసి నిద్రపోవాలని చెబుతున్నారు. ఇదంతా చదివిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే ఎంత కుదిరితే అంత తక్కువగా ఫోన్ వాడటం మంచిదని.
