Begin typing your search above and press return to search.

ఇండియా మామిడి పండ్లను అమెరికా రిజెక్టు చేశాక ఏం జరిగింది?

కొద్ది రోజుల క్రితం ఒక వార్త అందరిని ఆకర్షించింది. కాస్తంత ఆందోళనకు గురి చేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతైన మామిడి పండ్లు.. అక్కడకు చేరిన తర్వాత అక్కడి అధికారులు వాటిని రిజెక్టు చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 May 2025 11:16 AM IST
ఇండియా మామిడి పండ్లను అమెరికా రిజెక్టు చేశాక ఏం జరిగింది?
X

కొద్ది రోజుల క్రితం ఒక వార్త అందరిని ఆకర్షించింది. కాస్తంత ఆందోళనకు గురి చేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతైన మామిడి పండ్లు.. అక్కడకు చేరిన తర్వాత అక్కడి అధికారులు వాటిని రిజెక్టు చేయటం తెలిసిందే. దీంతో.. వాటిని పంపిన వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి వేళ.. వాటిని తిరిగి భారత్ కు తీసుకురావటం. లేదంటే వాటిని అక్కడే పడేయటం. ఈ విషయంలో మామిడి పండ్ల ఎగుమతిదారులు తాము ఎగుమతి చేసిన స్టాక్ ను అక్కడే పడేయటం మంచిదని నిర్ణయించారు. దీంతో.. సుమారు రూ.4.2 కోట్ల నష్టం వాటిల్లింది.

తిరిగి తీసుకురావటానికి అయ్యే ఖర్చులు భారంతోపాటు త్వరగా పాడయ్యే గుణం ఉన్న పంట కావటంతో వాటిని అక్కడే వదిలేయాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో అమెరికాకు మామిడిపండ్ల ఎగుమతి అంశం ఏం జరగనుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఇప్పటికంటే మెరుగైన పండ్లను పంపేలా ప్లాన్ చేస్తామని ఎగుమతిదారులు చెబుతున్నారు.

అమెరికాకు పంపిన మామిడి పండ్లలో 15-17 టన్నుల సరుకు రిజెక్టు అయినట్లుగా చెబుతున్నారు. ఈ మామిడి పండ్లను అమెరికాలోని లాస్ ఏంజిలెస్.. శాన్ ఫ్రాన్సిస్కో.. అట్లాంటా ఎయిర్ పోర్టులలో దించారు. ముంబయి నుంచి ఎగుమతి చేసే సమయంలో ఈ పండ్లకు పురుగు పట్టకుండా ఉండేందుకు వీలుగా అమెరికా వ్యవసాయ శాఖ అధికారి పర్యవేక్షణలో నవీ ముంబయిలోని ఒక కేంద్రంలో ఇర్రేడియేషన్ ప్రక్రియ చేపట్టామని చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారని.. అయితే.. తాజా ఎపిసోడ్ లో మాత్రం స్టాక్ అమెరికాకు వెళ్లిన తర్వాత సదరు పత్రం లేదని తిరస్కరించినట్లుగా వాపోయారు.

దీనికి సంబంధించి వారు మరింత లోతుగా వివరాలు సేకరించగా ఒక కొత్త అంశం వెలుగు చూసింది. అమెరికాలోని అధికారుల చెబుతున్నదేంటే.. భారత్ లోని యూఎస్ డీఏ అధికారులు మామిడి పండ్లను పరీక్ష చేసిన తీరుపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే సదరు సర్టిఫికేట్ ను తాము రిజెక్టు చేసినట్లుగా చెప్పారని ఎగుమతిదారు ఒకరు చెబుతున్నారు. తాజా అనుభవంతో ఈసారి తప్పు ఎక్కడ జరిగింది? ఎక్కడ సమాచార లోపం ఉంది? సమన్వయం విషయంలో చోటు చేసుకున్న పొరపాట్లు మరోసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి రిపీట్ కాదంటున్నారు. ఏమైనా.. తాజా పరిణామం అమెరికాకు ఎగుమతి చేసే వారిని మరింత అప్రమత్తం అయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు.