భారత్ పై మళ్లీ నిషేధం.. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా?
భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు, పండ్లకు అంతర్జాతీయంగా భలే క్రేజ్ ఉంటుంది.
By: Madhu Reddy | 28 May 2026 5:00 PM ISTభారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు, పండ్లకు అంతర్జాతీయంగా భలే క్రేజ్ ఉంటుంది. కానీ మన క్వారంటైన్ కేంద్రాల నిర్లక్ష్యం వల్ల తరచూ విదేశాల్లో నిషేధాల పర్వం నడుస్తోంది. తాజాగా జపాన్ దేశం మన మామిడి పండ్లపై నిషేధం విధించడంతో ఎగుమతిదారులు లబోదిబోమంటున్నారు. గతంలో ఐరోపా సమాఖ్య అమెరికా దేశాలు కూడా మన ఉత్పత్తులపై ఇలాంటి ఆంక్షలే విధించాయి. క్వాలిటీ కంట్రోల్ విషయంలో మన అధికారులు ఇప్పటికైనా మేల్కొని కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ వివరాలు చూద్దాం..
కోట్లల్లో నష్టం.. నడిసముద్రంలో కంటైనర్లు:
జపాన్ ప్రభుత్వం మార్చి 25, 2026 తర్వాత ఇండియా జారీ చేసిన తనిఖీ సర్టిఫికెట్లను తిరస్కరించింది. ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల అప్పటికే సముద్ర, వాయు మార్గాల్లో ప్రయాణిస్తున్న వందలాది టన్నుల మామిడి షిప్‌మెంట్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. పండ్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉండటంతో ఎగుమతిదారులకు కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఇక దీంతో భారత ప్రభుత్వ సంస్థ 'అపెడా' రంగంలోకి దిగి జపాన్ అధికారులతో అత్యవసర చర్చలు జరుపుతోంది.
ప్యాకేజింగ్‌లోనూ ఘోర తప్పిదాలు:
సరిగ్గా మగ్గబెట్టకపోవడం (VHT ట్రీట్‌మెంట్) ఒక ఎత్తయితే, పండ్లను ప్యాక్ చేసే విధానంలో కూడా మనవాళ్లు దొరికిపోయారు. ఇక తెగుళ్లు సోకకుండా వాడాల్సిన ప్రత్యేక 'ఇన్సెక్ట్-ప్రూఫ్' బాక్సుల సీలింగ్‌లో లోపాలు ఉన్నట్లు జపాన్ ఇన్‌స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇక మన శుద్ధి కేంద్రాల్లో క్వాలిటీ ప్రమాణాలను తక్షణమే పునరుద్ధరించేందుకు ప్రస్తుతం చర్యలు చేపట్టారు.
గతంలో ఐరోపా సమాఖ్య ఇచ్చిన షాక్:
ఇక ఇలాంటి ఘటనే 2014లో కూడా జరిగింది. ఇండియా నుంచి లండన్ వెళ్లిన మామిడి కంటైనర్లలో 'పండ్ల ఈగలు' ఉన్నట్లు అక్కడ ఆఫీసర్ లు గుర్తించారు. ఇక దీనివల్ల యూరప్ స్థానిక పంటలు దెబ్బతింటాయని భావించి.. మామిడితో పాటు మన కాకరకాయ, పొట్లకాయ, వంకాయలపై ఐరోపా సమాఖ్య నిషేధం విధించింది. అయితే ఇక భారత్ తగిన రక్షణ చర్యలు చేపట్టడంతో 2015లో ఆ నిషేధం తొలిగిపోయింది.
అమెరికాలో మన దానిమ్మపళ్లకు ఆంక్షలు:
భారతీయ దానిమ్మపళ్లకు ముఖ్యంగా 'భగవా' రకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కానీ వీటిలో ఉండే ‘కాయ తొలిచే పురుగు’ తమ దేశంలో వ్యాపిస్తుందనే భయంతో ఒకప్పుడు అమెరికా అధికారులు ఆంక్షలు విధించారు. దీనికోసం భారత్ ప్రత్యేకంగా ఇరాడియేషన్ కిరణాల ద్వారా క్రిమిసంహారక చర్య అనే సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాతే అమెరికా మళ్లీ దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విదేశీ మార్కెట్లు నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడవు. ఒక్క చిన్న పురుగు కనిపించినా మన ఇమేజ్ తగ్గుతుంది. ఇప్పటికైనా మన అధికారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే మన దేశ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌లో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది.
