Begin typing your search above and press return to search.

యూఎస్ లో కుక్కకాటు.. 15 ఏళ్ల తర్వాత పరిహారం..ఎంతంటే?

ప్రస్తుతం అమెరికాలో లేకున్నా.. అతడికి అందాల్సిన పరిహారం అందిన వైనం ఆసక్తికరమని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   4 July 2025 4:00 PM IST
యూఎస్ లో కుక్కకాటు.. 15 ఏళ్ల తర్వాత పరిహారం..ఎంతంటే?
X

దేశం కాని దేశానికి వెళ్లి బాధితుడిగా మారి.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా? అంటే.. ఉండదనే మాటే ఎక్కువమంది చెబుతారు. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఆ విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. పదిహేనేళ్ల క్రితం తనకు జరిగిన దానికి న్యాయపోరాటం షురూ చేసిన తెలుగోడు.. ప్రస్తుతం అమెరికాలో లేకున్నా.. అతడికి అందాల్సిన పరిహారం అందిన వైనం ఆసక్తికరమని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తెలంగాణలోని సూర్యాపేట (ఇప్పటి) జిల్లా చింతలపాలెం మండలానికి చెందిన వి.కిశోర్ 2010లో అమెరికాలో ఉండేవారు. రోడ్ ఐలాండ్ లో ఒక అద్దె ఇంటి కోసం ఆయన కార్లా అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె పెంపుడు కుక్క కిశోర్ పై దాడి చేసి కరిచింది. దీంతో.. వైద్య ఖర్చుల కోసం 600 డాలర్లు పరిహారం కింద ఇస్తానని హామీ ఇచ్చింది. చెప్పినట్లుగా పరిహారం ఇవ్వకపోగా.. తర్వాతి దశల్లో కిశోర్ ను తిట్టింది. దీంతో ఆయన వాషింగ్టన్ డీసీలో కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో ఇరు వర్గాల వాదనల అనంతరం అదే ఏడాది కిశోర్ కు పరిహారం ఇవ్వాలని.. కోర్టు ఖర్చులతో కలిపి 10,359 డాలర్లు ఇవ్వాలని కార్లాకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అప్పటికే ఆమె ఐపీ (దివాళ) పెట్టటం.. ఇల్లు తనఖాలో ఉండటంతో కిశోర్ కు రావాల్సిన పరిహారం రాలేదు. ఇటీవల ఆమె తన ఇంటిని అమ్మేసింది. దీంతో.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పరిహారం మొత్తం వడ్డీతో సహా 29,092 డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.15.73 లక్షలు) తన ఖాతాలో జమ అయినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం కిశోర్ కెనడాలో ఉంటున్నారు.అయినప్పటికీ తన పాత కేసుకు సంబంధించి పరిహారం వచ్చిన వైనం ఆసక్తికరంగానే కాదు.. అమెరికాలోని చట్టాల అమలు ఎలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.