TRP రేటింగ్స్‌కు విరామం… సెన్సేషనలిజం తగ్గే ఛాన్స్?
వచ్చే నాలుగు వారాల పాటు న్యూస్ ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్స్‌ను నిలిపివేస్తూ బార్క్ (BARC) సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 7 March 2026 12:21 PM ISTప్రజాస్వామ్య దేశంలో న్యూస్ ఛానళ్లు బాధ్యతగా ఉండాలి, కానీ రేటింగ్‌ల వేటలో పడి కొన్ని సంస్థలు హద్దులు దాటుతున్నాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, తప్పుడు వీడియోలు, గ్రాఫిక్స్‌తో భయాందోళనలు సృష్టించే 'సెన్సేషనలిజం'కు అడ్డుకట్ట వేయాలని భారత సమాచార, ప్రసార శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు వారాల పాటు న్యూస్ ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్స్‌ను నిలిపివేస్తూ బార్క్ (BARC) సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
రేటింగ్‌ల వేటలో నలిగిపోతున్న నిజాలు:
మన దేశంలో న్యూస్ ఛానళ్ల మధ్య పోటీ ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎవరు ముందు వార్త ఇస్తారనే దానికంటే, ఎవరు ఎక్కువ 'హైప్' క్రియేట్ చేస్తారనేదే ఇక్కడ ముఖ్యం అయిపోయింది. ఇక గతంలో పహల్గామ్ దాడులు లేదా ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని ఛానళ్లు కేవలం వ్యూస్ కోసం కట్టుకథలు అల్లడం, లేనిపోని భయాందోళనలు సృష్టించడం మనం చూశాం. ఇక ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, మళ్ళీ అదే డ్రామా పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకే టీఆర్‌పీ రేటింగ్స్ లేకపోతే, ఛానళ్లు అనవసరమైన హడావుడి చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ఈ నాలుగు వారాల విరామం వార్తల్లో నాణ్యతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్.. డ్రోన్ దాడుల విజువల్స్:
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే పాత వీడియోలను లేదా ఏదో గేమ్ లోని విజువల్స్‌ను తీసుకువచ్చి, అవి ఇప్పుడు జరుగుతున్న డ్రోన్ దాడులంటూ కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ప్రేక్షకులను బురిడీ కొట్టించి టీవీలకు హత్తుకుపోయేలా చేసే ఈ 'ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్' వల్ల దేశంలో అనవసరమైన ఆందోళనలు రేగుతున్నాయి. ఇక క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల వీడియోలతో గ్రాఫిక్స్ కలిపి సినిమా రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడం వల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రసార శాఖ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల, రేటింగ్ పాయింట్ల కోసం అర్ధ సత్యాలను వడ్డించే ధోరణికి బ్రేక్ పడే అవకాశం ఉంది. బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు ఛానళ్లు అడుగులు వేయడానికి ఇదే మంచి సందర్భం.
ప్రజారోగ్యం మరియు జాతీయ ప్రయోజనం:
వార్తలు వినోదం కోసం కాదు, సమాచారం కోసం అనే విషయాన్ని గుర్తు చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ప్రజల మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా, సెన్సేషనల్ థంబ్ నైల్స్ మరియు మ్యూజిక్ లతో వార్తలను వడ్డించడం వల్ల సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోంది అని గురించాలి.ఇక రేటింగ్ పాయింట్లు లేనప్పుడు ఛానళ్లు క్షేత్రస్థాయి వాస్తవాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నాలుగు వారాల పాటు కేవలం నమ్మదగ్గ వార్తలను మాత్రమే ప్రజలకు చేరవేసేలా మీడియా యాజమాన్యాలపై ఒత్తిడి పెరుగుతుంది.ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు మీడియా రంగంలో ఒక ఆరోగ్యకరమైన మార్పుకు నాంది పలుకుతుందని, ఇకపై వార్తలు కేవలం 'రేటింగ్స్' కోసం కాకుండా 'ప్రజల' కోసం ఉంటాయని ఆశిద్దాం. వార్తా ఛానళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. టీఆర్‌పీ రేటింగ్స్ కంటే వాస్తవాలకే విలువివ్వాలని సగటు ప్రేక్షకుడు కుడ కోరుకుంటున్నాడు.
