పాక్ నటికి పానీ బాటిల్స్ గిఫ్ట్... భారత ఫ్యాన్స్ వీడియో వైరల్!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 April 2025 8:31 AMపహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం పక్కాగా ఉందని బలంగా నమ్ముతున్న భారత్.. దౌత్యపరమైన చర్యలు తీసుకుని ఇప్పటికే షాకిచ్చింది. త్వరలో సైనిక చర్యలు ఉండే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క.. సీమాంతర ఉగ్రవాదం, దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు, ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోడీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ నటికి భారత్ ఫ్యాన్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్ పంపినట్లు వీడియో హల్ చల్ చేస్తోంది.
అవును... పహల్గాం దాడి అనంతరం భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా... సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చే స్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. త్వరలో పాక్ ఎడారి కాబోతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో.. పాకిస్థాన్ లోని నటికి భారత్ ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్ పంపుతున్నారు!
ఇందులో భాగంగా... పాకిస్థాన్ నటి హనియా అమీర్ కు భారత అభిమానులు వాటర్ బాటిళ్లు పంపినట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ బాక్స్ పై... హనియా అమిరీ, రావల్పిండి, పంజాబ్, పాకిస్థాన్ అని "టు" అడ్రస్ ఉండగా... ఫ్రమ్ అడ్రస్ లో ఇండియా అని రాసి ఉంది. ఈ క్లిప్ వైరల్ గా మారింది.
కాగా... ప్రముఖ పాకిస్థానీ నటి హనియా కు భారత్ లో ఫ్యాన్స్ బాగానే ఉన్నారు! ఈ సమయంలో ఆమె రాబోయే సినిమా "సర్ధార్ జీ 3"లో దిల్జీత్ దోసాంజ్ సరసన నటించగా.. ప్రస్తుత పరిస్థితులు దాన్ని ప్రభావితం చేయొచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ యూకే లో గత నెలలో పూర్తైనట్లు తెలుస్తోంది.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె నటించిన సన్నివేశాలను మరో నటితో రీషూట్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ వీడియోను కొంతమంది నెటిజన్లు సరదాగా భావిస్తుండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి మీమ్స్ అవసరమా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పహల్గాం దాడి ఘటనను ఖండించిన వారిలో హనీయా ఒకరని గుర్తు చేస్తున్నారు!