Begin typing your search above and press return to search.

వింతైన కేసు: గరం మసాలాను డ్రగ్స్‌గా భ్రమించి అరెస్ట్.. 2 నెల‌లు జైలు త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

ఈ అక్రమ అరెస్టుకు దర్యాప్తు సంస్థల అనుభవరాహిత్యంతో పాటు దేశంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల దయనీయ స్థితి కూడా అద‌నంగా తోడైంది.

By:  Sivaji Kontham   |   21 May 2026 1:24 PM IST
వింతైన కేసు: గరం మసాలాను డ్రగ్స్‌గా భ్రమించి అరెస్ట్.. 2 నెల‌లు జైలు త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?
X

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. కొన్నిసార్లు అది మానవ తప్పిదాల కార‌ణంగా అమాయకులు బలి కావాల్సి వస్తుంది. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు పటిష్టంగా ఉండటం అవసరమే కానీ.. ఒక సాధారణ గరం మసాలా పొడిని చూసి ప్రాణాంతకమైన డ్రగ్స్ (హెరాయిన్) గా నిర్ధారించడం అత్యంత విడ్డూరం. ఇటువంటి వింతైన, దురదృష్టకరమైన ఘటనే ఒక భారతీయ పౌరుడి జీవితాన్ని 2 నెల‌ల పాటు జైలు జీవితంతో అతలాకుతలం చేసింది. 16 ఏళ్ల క్రితం జరిగిన ఈ అన్యాయమైన నిర్బంధ ఘ‌ట‌న‌పై తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అజయ్ సింగ్ మే 2010లో భోపాల్ విమానాశ్రయం నుండి ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్ర‌యానికి వ‌చ్చారు. ఆయన లగేజీని తనిఖీ చేసిన `ఎక్స్‌ప్లోజివ్స్ ట్రేస్ డిటెక్టర్` (ఇటిడి) యంత్రం సాంకేతిక లోపం కారణంగా అందులోని ఆమ్‌చూర్, గరం మసాలా పొడులను నిషేధిత మాదకద్రవ్యాలుగా చూపించింది. దీనితో విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు అజయ్ సింగ్‌ను ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ అక్రమ అరెస్టుకు దర్యాప్తు సంస్థల అనుభవరాహిత్యంతో పాటు దేశంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల దయనీయ స్థితి కూడా అద‌నంగా తోడైంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ మసాలా పొడులను పరీక్షించడానికి భోపాల్‌లోని స్థానిక ల్యాబ్‌లో కనీస ఆధునిక పరికరాలు లేవు. ఫలితంగా పది రోజుల తర్వాత ఆ నమూనాలను హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపాల్సి వచ్చింది. చివరికి 30 జూన్ 2010న అవి డ్రగ్స్ కాదని హైదరాబాద్ ల్యాబ్ తేల్చేప్ప‌టికే.. ఏ తప్పూ చేయని అజయ్ సింగ్ ఏకంగా 57 రోజుల పాటు జైలులోనే మగ్గిపోవాల్సి వచ్చింది.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ ఖోట్.. బాధితుడి అన్యాయ‌మైన జైలు నిర్బంధాన్ని ప్రాథమిక హక్కుల తీవ్ర ఉల్లంఘనగా అభివర్ణించారు. కనీస విశ్లేషణా పరికరాలు.. అర్హులైన సిబ్బంది లేనప్పుడు రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను ఎలా నిర్వహిస్తారని తీవ్రంగా మండిపడ్డారు. నెల రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను తనిఖీ చేసి... వాటిని ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

బాధితుడు అజయ్ సింగ్ తన కెరీర్ తో పాటు గౌరవం దెబ్బతిన్నందుకు 2011లో రూ. 10 కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. దోషులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని... లోపభూయిష్ట యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సాంకేతిక పరికరాలపైనే పూర్తిగా ఆధారపడకుండా.. విమానాశ్రయాలలో సరైన శిక్షణ పొందిన మానవ వనరులను కేటాయించాల్సిన అవసరాన్ని ఈ కేసు నిరూపిస్తోంది.