ఇరాన్ కూల్చిన హెలీకాఫ్టర్ సైనికుడిని బోట్ లో ఎస్కేప్ చేసిన ఇండియన్!?
ఈ సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైభవ్ అల్టేకర్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భారతీయుడు.
By: Sivaji Kontham | 10 Jun 2026 11:00 AM ISTఓవైపు ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. భారతీయులను అమెరికా నుంచి తరిమేయాలనే కుయక్తితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇరాన్ దాడిలో కూలిన హెలీకాఫ్టర్ సైనికుడిని అత్యంత చాకచక్యంగా రక్షించిన మేధోతనం ఎవరిదో తెలుసుకోవాలని ఉందా? .. అది ఒక ఇండియన్ టెక్నీషియన్ మేధోతనం అని తెలిస్తే గర్వపడకుండా ఉండగలరా? పూర్తి వివరాల్లోకి వెళితే...
హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ దళాలు కూల్చివేసిన అపాచీ హెలికాప్టర్ పైలట్, కో-పైలట్‌లను రక్షించడానికి యుఎస్ నేవీ ఒక అత్యాధునిక డ్రోన్ బోట్‌ను ఉపయోగించింది. ఈ ప్రత్యేకమైన రెస్క్యూ మిషన్‌లో వినియోగించిన అటానమస్ సర్‌ఫేస్ వెజెల్ ను టెక్సాస్‌కు చెందిన ఒక సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ సహ-వ్యవస్థాపకులలో భారతీయ-అమెరికన్ (ఎన్నారై) వైభవ్ అల్టేకర్ ఒకరు కావడం విశేషం. సముద్రంలో చిక్కుకున్న సైనిక సిబ్బందిని రక్షించడానికి యుఎస్ మిలిటరీ ఒక మానవరహిత... రిమోట్ ఆపరేటెడ్ నౌకను ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
యుఎస్ సాయుధ దళాలు `సరోనిక్ టెక్నాలజీస్` అనే సంస్థ అభివృద్ధి చేసిన `కోర్సాట్` అనే డ్రోన్ బోట్‌ను గత కొంతకాలంగా ఉపయోగిస్తున్నాయి. సుమారు 24 అడుగుల పొడవు ఉండే ఈ కోర్సాట్ బోట్ డీజిల్‌తో నడుస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 35 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. 1000 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే ఈ బోట్ దాదాపు 1000 పౌండ్ల బరువును మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కథనాలొస్తున్నాయి. సంప్రదాయ సైనిక వనరులతో పాటు మానవరహిత వాహనాలను విస్తరించాలనే పెంటగాన్ వ్యూహంలో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే డ్రోన్‌లను పర్యవేక్షించే యుఎస్ నేవీకి చెందిన`టాస్క్ ఫోర్స్ 59`లో ఈ బోట్ ఒక భాగం.
ఈ అత్యాధునిక సాంకేతికతను అందించిన `సరోనిక్ టెక్నాలజీస్` సంస్థ ప్రొఫైల్ ప్రకారం.. స్వయంప్రతిపత్త నౌకల తయారీ కోసం ఈ సంస్థ యుఎస్ నేవీతో 392 మిలియన్ డాలర్ల భారీ ఉత్పత్తి ఒప్పందాన్ని కలిగి ఉంది. టెక్సాస్‌లోని ఆస్టిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని సెప్టెంబర్ 2022లో స్థాపించారు. 11 సంవత్సరాల పాటు నేవీ సీల్స్ సభ్యుడిగా పనిచేసిన డినో మావ్రూకాస్‌తో పాటు వైభవ్ అల్టేకర్, డౌగ్ లాంబెర్ట్ , రాబ్ లెమాన్ అనే మరో ముగ్గురు కలిసి దీనిని ప్రారంభించారు.
ఈ సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైభవ్ అల్టేకర్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భారతీయుడు. కంపెనీ స్వయంప్రతిపత్త (ఆటోనమస్) వ్యవస్థలు -సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధిని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కంపెనీ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. పర్సెప్షన్, నావిగేషన్, మెషిన్ లెర్నింగ్, కమాండ్ అండ్ కంట్రోల్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ వంటి రకరకాల విభాగాల బృందాలతో కలిసి ఆయన ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీరింగ్... ప్రొడక్ట్ - స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను నడిపిస్తున్నారు.
వైభవ్ అల్టేకర్ అటానమస్ సిస్టమ్స్ - మారిటైమ్ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన పర్సెప్షన్ ఇంజనీర్‌గా గుర్తింపు పొందారు. అతడు తన కెరీర్‌లో ఎక్కువ భాగం యుఎస్ రక్షణ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికే కేటాయించారు. గతంలో ప్రముఖ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ `ఆందురిల్`లో ప్రారంభ ఇంజనీర్లలో ఒకరిగా పనిచేసిన ఆయన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన `ఘోస్ట్ షార్క్` డ్రోన్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ సహా పలు కీలక కార్యక్రమాలకు ఇంజనీరింగ్ విభాగాధిపతిగా నాయకత్వం వహించారు.
