ఇరాన్ లో భారత ఇంజినీర్ అదృశ్యం... ఏమి జరిగింది?
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆందోళనకర విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 23 Jun 2025 5:26 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. గత పదిరోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పైగా ఈ యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు మరింత భయానకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన ఓ ఇంజినీర్ ఇరాన్ లో అదృశ్యమయ్యారనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆందోళనకర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భారత్ కు చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ అనే ఇంజినీర్ ఇరాన్ లో అదృశ్యమైనట్లు చెబుతున్నారు. దీంతో.. తమకు సాయం చేయాలని అతడి కుటుంబం కేంద్రాన్ని కోరింది.
వివరాళ్లోకి వెళ్తే... బిహార్ లోని సివాన్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో.. కొన్ని రోజుల క్రితం అతడితో పాటు మరో 30-35 మందిని నెల రోజుల వర్క్ వీసాపై ఇరాన్ లోని అరాక్ ప్రాంతంలో ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సదరు కంపెనీ పంపించింది.
దీంతో సిరాజ్ అలీ అన్సారీ... జూన్ 9న ఇరాన్ చేరుకున్నాడు. ఆ తర్వాత జూన్ 12 రాత్రి నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో దాడులు చేపట్టింది. ఇదే క్రమంలో... అరాక్ ప్రాంతంలోనూ ఐడీఎఫ్ దళాలు దాడులు చేసినట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో... సిరాజ్ తో పాటు మిగతావారిని ఓ రిఫైనరీ ప్లాంట్ టౌన్ షిప్ కు తరలించినట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత నుంచే తమ కుమారుడి ఆచూకీ తెలియడం లేదని సిరాజ్ తండ్రి హజ్రత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడితో చివరిసారిగా యుద్ధం మొదలైన ఐదురోజులకు, జూన్ 17న మాట్లాడినట్లు తెలిపారు. ఆ సమయంలో.. తాము ఉంటున్న ప్రాంతానికి కేవలం కిలోమీటరు దూరంలోనే పేలుడు సంభవించినట్లు సిరాజ్ తెలిపారని అన్నారు.
ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో తమకు కేంద్రప్రభుత్వం సహాయం చేయాలని ఆయన కోరారు! ఈ సందర్భంగా.. తమ కుమరుడి ఆచూకీ కోసం సిరాజ్ తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
