Begin typing your search above and press return to search.

చదువుల ఒత్తిడి కాదు.. ఆలోచించే వ్యవస్థ కావాలి!

క్లాసులో ఫస్ట్ ర్యాంకు రావాలనే పట్టుదల, పక్కింటి అబ్బాయితో పోలికలు పిల్లల మనసులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.

By:  Madhu Reddy   |   14 July 2026 6:00 PM IST
చదువుల ఒత్తిడి కాదు.. ఆలోచించే వ్యవస్థ కావాలి!
X

మన విద్యావ్యవస్థలో ఈరోజుల్లో మార్కుల వేట, ర్యాంకుల గోల ఎక్కువైపోయింది. సినిమాల్లో బట్టీపట్టి రాసే 'చతుర్' లాంటి వాళ్లను మనం హీరోలుగా చూస్తున్నామే తప్ప, సరికొత్తగా ఆలోచించే 'ఫున్‌సుక్ వాంగ్డూ' లాంటి మేధావులను గుర్తించలేకపోతున్నాం. పుస్తకాల్లో ఉన్న దాన్ని ఉన్నట్టుగా అప్పజెప్పే ఒత్తిడి కంటే, ఒక విద్యార్థిలో స్వతంత్రంగా ఆలోచించే తత్వాన్ని పెంచడమే అసలైన విద్య. ఆ మార్పు రానంతవరకు, మనం కేవలం డిగ్రీలు ఉన్న రోబోలను మాత్రమే తయారు చేయగలం కానీ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కర్తలను కాదు.

బట్టీల బడి.. ఆలోచనల సమాధి:

ఈ రోజుల్లో బడులు ఎలా తయారయ్యాయంటే.. పుస్తకంలో ఏముందో దాన్ని అలాగే తలకెక్కించుకోవాలి, పరీక్షల్లో అక్షరం పొల్లుపోకుండా దింపేయాలి. సరిగ్గా '3 ఇడియట్స్' సినిమాలో చతుర్ చేసినట్టు అన్నమాట.. కానీ ఈ పద్ధతి వల్ల పిల్లల్లో స్వంతంగా ఆలోచించే శక్తి చచ్చిపోతోంది. సైన్స్ అంటే కేవలం పరీక్షల కోసం చదవడం కాదు, సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం వెతకడం అనే విషయాన్ని మన విద్యావ్యవస్థ మర్చిపోతోంది.

ర్యాంకుల ఒత్తిడితో ఊపిరాడని బాల్యం:

క్లాసులో ఫస్ట్ ర్యాంకు రావాలనే పట్టుదల, పక్కింటి అబ్బాయితో పోలికలు పిల్లల మనసులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. 99 శాతం మార్కులు వస్తేనే ప్రయోజకుడు అంటారనే భయం పిల్లలను నిరంతరం వెంటాడుతోంది. ఫలితంగా వాళ్లు సబ్జెక్టును ప్రేమించి చదవడం లేదు, కేవలం భయంతో చదువుతున్నారు. ఈ ఒత్తిడి వల్లే ఎంతోమంది క్రియేటివ్ పిల్లలు తమ సహజ సిద్ధమైన టాలెంట్‌ను బయటపెట్టలేకపోతున్నారు.

సమాజానికి కావాల్సింది ఆవిష్కర్తలు.. యంత్రాలు కాదు:

మన దేశంలో ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీలు పూర్తి చేసిన లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు. కానీ అందులో ఎంతమంది కొత్త ఆలోచనలతో స్టార్టప్స్ పెడుతున్నారు? ఎంతమంది మన సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెడుతున్నారు? చాలా తక్కువ. కారణం, మన చదువులు కేవలం ఉద్యోగం ఎలా చేయాలో నేర్పుతున్నాయే తప్ప, కొత్తగా ఎలా ఆలోచించాలో నేర్పడం లేదు. మనకు కావలసింది ఉద్యోగాలు చేసే రోబోలు కాదు, సరికొత్త దారులు వెతికే మేధావులు.

ప్రశ్నించే తత్వమే అసలైన చదువు:

ఒక క్లాసు రూమ్‌లో పిల్లవాడు టీచర్‌ను ఒక వింత ప్రశ్న అడిగితే వెంటనే చాలామంది నవ్వుతారు, లేదా టీచర్లు కోప్పడతారు. సరిగ్గా '35' సినిమాలో పిల్లడు కి జరిగినట్టు, కానీ అక్కడే అసలైన తప్పు జరుగుతోంది. ఇక ప్రశ్నించడం నుంచే కొత్త ఆలోచనలు పుడతాయి. సమాజంలో ప్రతిదానిని గమనించడం, "ఇది ఇలా ఎందుకు ఉంది? దీన్ని ఇంకా సులభంగా ఎలా చేయవచ్చు?" అని ఆలోచించే వాతావరణం మన స్కూళ్లలో పెరగాలి. పుస్తకాలను దాటి లోకాన్ని చూడగలిగినప్పుడే అసలైన విద్య అందుతుంది.

విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పు:

కేవలం పరీక్షలు పాస్ అవ్వడం కోసం చదివే విధానానికి ఇకనైనా స్వస్తి పలకాలి. పిల్లలపై మార్కుల ఒత్తిడిని తగ్గించి, వారి క్రియేటివిటీకి రెక్కలు తొడగాలి. బట్టీపట్టే 'చతుర్'లను కాకుండా, వినూత్నంగా ఆలోచించి సమాజాన్ని మార్చే 'ఫున్‌సుక్ వాంగ్డూ' లాంటి మేధావులను ప్రోత్సహించే ఆలోచనా వ్యవస్థ మనకు కావాలి. అప్పుడే మన దేశంలో నిజమైన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి...