Begin typing your search above and press return to search.

టైమింగ్ లో ఇండిగో టాప్.. ఏడాదిలో ఫ్లైట్ జర్నీల వృద్ధి ఎంతంటే?

మార్చిలో మొత్తం దేశీయ ప్రయాణాల్లో ఇండిగో టాప్ లో నిలిచింది. ఈ సంస్థకు చెందిన విమానాల్లో 93.1 లక్షల మంది ప్రయాణాలు చేశారు.

By:  Tupaki Desk   |   27 April 2025 1:00 PM IST
టైమింగ్ లో ఇండిగో టాప్.. ఏడాదిలో ఫ్లైట్ జర్నీల వృద్ధి ఎంతంటే?
X

దేశంలో విమానయానం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మార్చి నెలకు సంబంధించి దేశ వ్యాప్తంగా సాగిన విమాన ప్రయాణాలకు సంబంధించిన నివేదిక సిద్ధమైంది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో వృద్ధి రేటు 8.79 శాతం ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మార్చి మొత్తం కలిపి 1.33 కోట్ల మందికి సేవలు అందించినట్లుగా పేరకొన్నారు. దేశీయ ప్రయాణికులకు సంబంధించి తాజా రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

మార్చిలో మొత్తం దేశీయ ప్రయాణాల్లో ఇండిగో టాప్ లో నిలిచింది. ఈ సంస్థకు చెందిన విమానాల్లో 93.1 లక్షల మంది ప్రయాణాలు చేశారు. మొత్తం మార్కెట్ వాటాలో ఇండిగో వాటా 64 శాతం. ఆ తర్వాతి స్థానంలో ఎయిర్ ఇండియా గ్రూపు నిలిచింది. ఈ సంస్థ కింద ఎయిర్ ఇండియా.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బ్రాండ్లు ఉన్నాయి. మార్చిలో 38.8 లక్షలమంది ప్రయాణికుల్ని చేరవేయటం ద్వారా 26.7 శాతం వాటానుసొంతం చేసుకుంది.

ఈ రెండు సంస్థల తర్వాత ఆకాశ ఎయిర్ 7.2 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేయటం ద్వారా ఆరు శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇక.. స్పైస్ జెట్ విషయానికి వస్తే 4.8 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేయటం ద్వారా 3.3 శాతం వాటాను సొంతం చేసుకుంది. టైమింగ్ విషయంలో ఇండిగో టాప్ గా నిలిచింది.

కచ్ఛితమైన సమయ వేళల్ని పాటించే విషయంలో ఇండిగో 88.1 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆకాశ ఎయిర్ 86.9 శాతంలో నిలిచింది. ఎయిరిండియా గ్రూపు 82 శాతంతో మూడో స్థానంలో.. స్పైస్ జెట్ 72.1శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది.