ఢిల్లీలోని లెయిర్ బార్ ఆసియాలో నంబర్ వన్
ఢిల్లీలోని వసంత విహార్‌లో ఉన్న లెయిర్ బార్ మన దేశం తరఫున అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
By: Tupaki Desk | 18 July 2025 3:33 PM ISTప్రపంచవ్యాప్తంగా దేశాలు అనేక రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఆహారం, సంస్కృతి, పర్యాటకం, వాణిజ్యం వంటి వాటిల్లో ర్యాంకింగ్‌లు ఇవ్వడం సర్వసాధారణం. ఇదే కోవలో, కాక్‌టెయిల్స్ ప్రపంచానికి సంబంధించిన "ఆసియా 50 బెస్ట్ బార్స్ - 2025" జాబితాలో మన దేశం భారత్ అద్భుతమైన ప్రదర్శనతో మిగిలిన దేశాలను అధిగమించింది. దేశ రాజధాని ఢిల్లీలోని లెయిర్ బార్ ఆసియాలో నంబర్ వన్ స్థానం సాధించగా, భారత్ నుంచి మొత్తం ఐదు బార్‌లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.
+ లెయిర్ బార్ - ఢిల్లీ
ఢిల్లీలోని వసంత విహార్‌లో ఉన్న లెయిర్ బార్ మన దేశం తరఫున అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జైరాజ్ సింగ్ సోలంకి, ధ్రువ్ రాజ్ విజ్ 2019లో దీనిని స్థాపించారు. గాజు మీద తినదగిన పెయింట్, పికాంటే వంటి ప్రత్యేక కాక్‌టెయిల్స్, మోనోక్రోమ్ ఇంటీరియర్ డిజైన్ వంటి వైవిధ్యాలు దీనిని విశిష్టంగా నిలిపాయి. ఇది కేవలం బార్ మాత్రమే కాదని, ఇదొక విభిన్నమైన అనుభూతుల సమాహారమని చెప్పొచ్చు.
- సోకా బార్ - బెంగళూరు
గోవా కళాకృతులు, 38 సీట్ల ప్రత్యేక సెటప్‌తో సోకా బార్ కాక్‌టెయిల్స్‌లో సరికొత్త కథలను చెబుతుంది. చెఫ్ సోంబీర్ చౌధరి, బార్టెండర్ అవినాష్ కపోలి నాయకత్వంలో ఈ బార్ స్థానిక రుచులను ఆధారంగా చేసుకొని వినూత్న పానీయాలను అందిస్తోంది. మోఫో డాన్, క్లారిఫైడ్ జాస్మిన్ వంటి పేర్లతో పానీయాలు అందించడం ఈ బార్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.
-బాయిలర్‌మేకర్ - గోవా
గోవాలోని ఈ బార్ క్రాఫ్ట్ బీర్, కాక్‌టెయిల్స్‌ను సమన్వయంతో అందిస్తూ, స్మాషబుల్స్, సెషనబుల్స్, షార్టీస్ అనే మూడు వేర్వేరు మెనూలతో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. పాపా ఇష్యూస్, చోటు గరిబాల్డి వంటి వినూత్న కాక్‌టెయిల్స్‌తో ఇది ఆకట్టుకుంటోంది.
- జెడ్‌ఎల్‌బీ23 - బెంగళూరు
ది లీలా ప్యాలెస్‌లో ఉన్న ఈ బార్ న్యూయార్క్, క్యోటో శైలుల మేళవింపుతో ఆకట్టుకుంటుంది. షిసో నెగ్రోనిస్, స్మోకీ ఓల్డ్–ఫ్యాషన్డ్ వంటి పానీయాలు, లైవ్ జాజ్ సంగీతం ఈ బార్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.
- స్పిరిట్ ఫార్వర్డ్ - బెంగళూరు
లావెల్ రోడ్‌లోని ఈ బార్ వినూత్నతకు ప్రతీక. ఐస్ క్యూబ్‌లపై స్టాంపులు, బ్లూ చీజ్‌తో నింపిన ఆలివ్‌లు, సీసాలో అందించే జిన్ మార్టినీలు తదితర వాటితో వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. 'సదరన్ స్టార్' అనే టకీలా కాక్‌టెయిల్ 36 గంటలు ఫెర్మెంట్ చేసిన గువావా, ప్లమ్, జలపీనో మిశ్రమంతో తయారవుతుంది.
- 51–100 జాబితాలో నిలిచిన ఇతర భారతీయ బార్‌లు:
ఔట్‌రిగ్గర్ – గోవా (55వ స్థానం)
సైడ్‌కార్ – ఢిల్లీ (62వ స్థానం)
బాంబే క్యాంటీన్ – ముంబై (69వ స్థానం)
హైడ్‌అవే – గోవా (94వ స్థానం)
ఈ ర్యాంకింగ్స్ భారత్ యొక్క కాక్‌టెయిల్, బార్ సంస్కృతిలో వస్తున్న విప్లవాత్మక మార్పులను సూచిస్తున్నాయి. బార్‌లు ఇక కేవలం మద్యం సేవించడానికే కాకుండా, కళ, సృజనాత్మకత, సాంస్కృతిక అనుభూతుల ప్రదర్శన మాధ్యమంగా మారుతున్నాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రాండ్స్, స్థానికుల నుంచి రూపొందించిన పానీయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమంటే మనం గర్వించాల్సిన విషయం.
