మీ బ్యాంక్ వెబ్ అడ్రస్ లో మార్పు కనిపించిందా కంగారొద్దు
సైబర్ మోసాలకు విరుగుడుగా భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు దేశీయ బ్యాంకులు తమ వెబ్ అడ్రస్ లను మారుస్తున్నాయి
By: Tupaki Desk | 1 Nov 2025 12:00 PM ISTసైబర్ మోసాలకు విరుగుడుగా భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు దేశీయ బ్యాంకులు తమ వెబ్ అడ్రస్ లను మారుస్తున్నాయి. ఇప్పటివరకు .com లేదంటే .in తరహాలో వేర్వేరు అడ్రస్ లు ఉండి ఉండొచ్చు. వీటిని అసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు ప్రజల్ని మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తప్పుడు పనులకు చెక్ పెట్టేందుకు వీలుగా దేశీయంగా పలు బ్యాంకులు తమ డొమైన్ ను మార్చేశాయి.
డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత పెంచేందుకు వీలుగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా తాజా మార్పును పలు బ్యాంకులు చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న వెబ్ సైట్ అడ్రస్ లను అక్టోబరు 31లోపు .bank.in లోకి మారాలని ఈ ఏడాది ఏప్రిల్ 21న బ్యాంకులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు కొత్త డొమైన్ కు మారాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా .bank.in లోకి మారినట్లుగా కనిపిస్తాయి.
దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుడి భద్రలో భాగంగా చేపట్టిన ఈ చర్య ప్రజలకు మేలు చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ.. ప్రైవేటు బ్యాంకుల యూఆర్ఎల్ లో మార్పులు చోటు చేసుకోగా.. త్వరలో బ్యాంకేతర ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేకంగా ‘‘.fin.in’’ డొమైన్ ను తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు.
ఈ మార్పు కారణంగా ఆయా బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం ప్రయత్నించినప్పుడు యూఆర్ఎల్ లో కనిపించే మార్పును గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. కొన్ని వెబ్ సైట్లు పాత మోడల్ లో అంటే డాట్ కామ్ తోనే కంటిన్యూ అవుతున్నా.. ఏదైనా కేటగిరి ఎంపిక చేసినంతనే.. బ్యాంక్ ఇన్ తో కూడిన కొత్త డొమైన్ కు మళ్లుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా బ్యాంకుల వెబ్ అడ్రస్ లో మార్పుల్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అనవసరంగా గాబరాకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే..కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సందేహాల్ని తీర్చుకోవచ్చన్న సంగతి మర్చిపోవద్దు.
