హోమీ బాబాతో మొదలు.. ఎందరో ప్రముఖుల మృత్యువాత
ఎయిరిండియా తాజా విషాద వేళ.. స్వతంత్ర్య భారతంలో ఎందరో ప్రముఖుల్ని లోహ విహంగాలు బలి తీసుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ప్రముఖులు తమ ప్రాణాల్ని కోల్పోయారు.
By: Tupaki Desk | 14 Jun 2025 11:00 AM ISTఎయిరిండియా తాజా విషాద వేళ.. స్వతంత్ర్య భారతంలో ఎందరో ప్రముఖుల్ని లోహ విహంగాలు బలి తీసుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ప్రముఖులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అహ్మదాబాద్ లో కూలిన ఎయిరిండియా విమాన ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విమాన ప్రయాణాల్లో మరణించిన ప్రముఖుల్ని చూస్తే..
భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా. మన దేశానికి చెందిన విశ్వ విఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త. ఆయన కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 1966లో ఆయన ప్రయాణిస్తున్న ఎయిరిండియా 101 విమానం స్విట్జర్లాండ్ లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న మోంట్ బ్లాంక్ శిఖరంలో కూలింది ఈ ప్రమాదంలో ఆయన మరణించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో విమాన పైలెట్లు సరిగా కమ్యూనికేట్ చేసుకోకపోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుు సంజయ్ గాంధీ సైతం విమాన ప్రమాదంలోనే మరణించారు. పైలెట్ లైసెన్సు ఉన్న ఆయన 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్ధర్ జంగ్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ లో ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో నియంత్రణ కోల్పోయారు. దీంతో విమానం కూలటంతో ఆయన మరణించారు. కాంగ్రెస్ సీనియర నేత మాధవ్ రావ్ సింధియా కూడా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2001 సెప్టెంబరు 30న యూపీలోని కాన్పూర్ లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లే వేళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానం ప్రైవేటు ఫ్లైట్.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తనదైన ముద్ర వేసిన టీడీపీ నేత బాలయోగి 2002 మార్చి 3న హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఒక ప్రైవేటు ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బీమవరం నుంచి బయలుదేరారు. క్రిష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఒక చెరువు వద్ద హెలికాఫ్టర్ కూలిపోయింది. దీంతో ఆయన చనిపోయారు.
2004లో అప్పటి మేఘాలయ రాష్ట్ర మంత్రి సైప్రియన్ సంగ్మాతో పాటు మరో తొమ్మిది మంది పవన్ హాన్స్ హెలికాఫ్టర్ లో అసోంలోని గువాహటి నుంచి మేఘాలయ షిల్లాంగ్ కు వచ్చే వేళలో.. షిల్లాంగ్ కు 20 కి.మీ. దూరంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2004 ఏప్రిల్ 17న ప్రముఖ నటి సౌందర్య బెంగళూరు నుంచి తెలంగాణలోని కరీంనగర్ కు సింగిల్ ఇంజిన్ సెస్నా 180 విమానంలో బయలుదేరారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. సౌందర్యతో పాటు నలుగురు మరణించారు. అప్పటికి ఆమె వయసు 32 ఏళ్లు. ఆమె గర్భిణిగా ఉన్నారు.
2005 మార్చిలో అప్పటి హర్యానా మంత్రిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ సైతం విమాన ప్రమాదంలో మరణించారు. మరో మంత్రి సురీందర్ సింగ్ తో కలిసి హెలికాఫ్టర్ లో ఢిల్లీ నుంచి చండీగఢ్ కు వెళ్లే వేళలో విమానం కూలిపోవటంతో మరణించారు. 2009 సెప్టెంబరు 2న బెల్ 430 హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్న హెలికాఫ్ర్ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణాల్ని తీసింది. ఈ హెలికాఫ్టర్ నల్లమల అడవుల్లో ప్రవేశించినంతనే ప్రతికూల వాతావరణంతో కూలిపోయింది. ఈ విషాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మందిని విషాదంలోకి నెట్టేసింది.
2011 ఏప్రిల్ 30న అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు.. మరో నలుగురు హెలికాఫ్టర్ లో తవాంగ్ నుంచి ఇటానగర్ కు బయలుదేరారు. అయితే.. ఈ హెలికాఫ్టర్ కూలిపోవటంతో వారంతా చనిపోయారు. 2021 డిసెంబరు 8న దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ సైతం విమాన ప్రమాదంలోనే మరణించారు. ఆయన.. ఆయన భార్యయ మరో 11 మంది హెలికాఫ్టర్ లో తమిళనాడులోని సలూర్ నుంచి వెల్లింగ్టన్ కు బయలుదేరారు. అయితే.. వీరి హెలికాఫ్టర్ కూలిపోవటంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ మరణించారు.
