శుభాంశు శుక్లా భూమికి తిరిగొచ్చాడు.. వైరల్ వీడియో
శుభాంశు శుక్లా అమెరికాలో నిర్వహించిన ఓ ప్రయోగాత్మక అంతరిక్ష మిషన్‌లో భాగంగా ఇతర అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి మొత్తం 18 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు.
By: Tupaki Desk | 15 July 2025 5:53 PM ISTభారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించి భూమికి సురక్షితంగా తిరిగివచ్చాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. శుభాంశు ల్యాండింగ్‌ను లక్నోలో ఉన్న ఆయన తల్లిదండ్రులు ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సక్సెస్ అయిన క్షణంలో వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అంతరిక్షంలో 18 రోజులు
శుభాంశు శుక్లా అమెరికాలో నిర్వహించిన ఓ ప్రయోగాత్మక అంతరిక్ష మిషన్‌లో భాగంగా ఇతర అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి మొత్తం 18 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన అనేక కీలక శాస్త్రీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. అంతరిక్షంలో గడిపిన అనుభవం, మానవ శరీరంపై అంతరిక్ష ప్రయాణ ప్రభావాలు, పరిసరాల్లో ఉన్న సూక్ష్మ జీవుల అధ్యయనాలు వంటి అంశాలపై శుభాంశు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయన పరిశోధనలు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తల్లిదండ్రుల ఆనందం
అంతరిక్షానికి వెళ్లే సమయంలో శుభాంశు తల్లిదండ్రులు మిగిలిన భారతీయుల మాదిరిగానే గర్వంతో పాటు కాస్త ఆందోళనతో కూడిన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. తమ బిడ్డ అంతరిక్షంలో ఉన్నంత కాలం వారి గుండెలు ముకు బిగించుకున్నట్లే ఉన్నాయని వారు తెలిపారు. అయితే శుభంగా భూమికి తిరిగొచ్చిన సందర్భంగా వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఇది ప్రతి తల్లిదండ్రులకూ గర్వకారణమైన క్షణం.
భారత ప్రగతికి నిదర్శనం
శుభాంశు శుక్లా వంటి యువత అంతరిక్ష పరిశోధనల వైపు అడుగులు వేయడం భారత విజ్ఞానపరమైన ప్రగతికి నిదర్శనంగా భావించవచ్చు. ఆయన సాధించిన ఈ విజయంతో యావత్ దేశం గర్వపడుతోంది. భవిష్యత్తులో మరిన్ని శాస్త్రీయ విజయాలను సాధించాలని శుభాంశుకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిద్దాం.
