పహల్గామ్ దాడి సూత్రధారిని హతమార్చిన ఇండియన్ ఆర్మీ
ఇటీవల పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి నేపథ్యంలో భారత భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది.
By: Tupaki Desk | 25 April 2025 9:42 AMఇటీవల పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి నేపథ్యంలో భారత భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. జమ్మూ కాశ్మీర్లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పహల్గామ్ దాడి వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న లల్లీ హతంతో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
బందిపొరాలోని అల్తాఫ్ లల్లీ స్థావరం గురించి నిర్దిష్ట సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది గాయపడినట్లు, అలాగే ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన హేయమైన ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు , ఒక స్థానికుడు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కాశ్మీర్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు, ఇందులో విదేశీ ఉగ్రవాదులతో పాటు కొంతమంది స్థానిక మద్దతుదారులు కూడా ఉన్నారు. లాజిస్టికల్ సహాయం, సమాచారం , ఆశ్రయం కల్పించడంలో కొంతమంది స్థానికులు ఈ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పహల్గామ్ దాడి తరువాత, భారత సైన్యం కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల స్థావరాలపై అన్వేషణ , నిర్మూలన ఆపరేషన్లను తీవ్రతరం చేసింది. ఈ విస్తృత ఆపరేషన్లలో భాగంగానే ఈరోజు అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టడం భద్రతా బలగాలకు లభించిన ముఖ్యమైన విజయం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అమాయక పౌరుల భద్రతను కట్టుదిట్టం చేయడానికి భద్రతా బలగాలు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ చర్య ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.