Begin typing your search above and press return to search.

‘నేడు కాల్పుల విరమణకు చివరి తేదీ’... ఆర్మీ కీలక వ్యాఖ్యలు!

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల అనంతరం ఈ నెల 10 సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 May 2025 11:36 AM IST
‘నేడు కాల్పుల విరమణకు చివరి తేదీ’... ఆర్మీ కీలక వ్యాఖ్యలు!
X

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల అనంతరం ఈ నెల 10 సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ నెల 18 (నేటితో) భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తుందని.. ఈ రోజు ఇరు దేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరుపుతారని వస్తోన్న వార్తలపై ఆర్మీ స్పందించింది.

అవును... భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ అంగీకారానికి ఇరుదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నేటితో ఆ విరమణ ముగుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన రక్షణ శాఖ వర్గాలు.. ఆ వార్తలను, ప్రచారాన్ని ఖండిస్తూ.. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని తెలిపాయి.

ఇదే సమయంలో... ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతోందని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఆ రోజు ఇరుదేశాల డీజీఎంవోల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఇదే సమయంలో నేడు ఇరు దేశాల డీజీఎంవో ల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశాయి.

కాగా... ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకారచర్యలతో పాక్ వణికిపోయిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. పాక్, పీవోకేలలోని 9 ఉగ్రశిబిరాలను, 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. తర్వాత ప్రతీకార చర్యలకు దిగిన పాకిస్థాన్ ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

ఈ సమయంలో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన పాకిస్థాన్.. ప్రపంచదేశాల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.. అనంతరం కాల్పుల విరమణ కోసం భారత్ ను అర్జించింది. దీంతో.. ఈ నెల 10 సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.

అయితే.. ఆ కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇదే సమయంలో... ఈ రోజు ఇరుదేశాల డీజీఎంవో ల మధ్య ఎలాంటి చర్చలు లేవని స్పష్టం చేసింది.