ఎక్స్ ప్రెస్ వే పై యుద్ధ విమానాల మెగా బల ప్రదర్శన.. వీడియో!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 4:34 PM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. మరోపక్క వరుసగా ఎనిమిదో రోజు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరుతూనే ఉంది. వారికి భారత సైన్యం గట్టిగా బదులిస్తుంది. ఈ సమయంలో భారత్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
అవును.. పహల్గాం దాడి అనంతరం ఓ పక్క భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ.. ఇరు దేశాల మధ్య యుద్ధ తప్పకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో.. ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఎక్స్ ప్రెస్ వేపై అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్ ను యుద్ధవిమానాలు సాధన చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాంపుర్ లోని గంగా ఎక్స్ ప్రెస్ వే పై శుక్రవారం సుమారు 3.5 కిలో మీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు సాధన జరుగుతోంది. ఈ హైవే లో ఎయిర్ స్ట్రిప్ ను యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ లకు అనుకూలంగా నిర్మించారు. అలా నిర్మించినవాటిలో ఇది నాలుగో హైవే కావడం గమనార్హం.
రెగ్యులర్ విమానాశ్రయాల్లోని రన్ వేకు ఈ ఎక్స్ ప్రెస్ రహదారి రన్ వే ప్రత్యామ్నాయంగా ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను ఈ సందర్భంగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఉదయం సాధారణ వేళల్లో, అటు రాత్రి 7 నుంచి 10 గంటల మధ్యలో.. రెండు సమయాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ యుద్ధ విమానాల రాక నేపథ్యంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకొంది. ఇందులో భాగంగా... సుమారు 250 సీసీ కెమెరాలను ఇన్ స్టాల్ చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని పూర్తిగా ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ లోకి తీసుకుంది. గతంలో ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బూందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేలపై ఈ సౌకర్యాలుండగా.. ఇది నాలుగో ఎక్స్ ప్రెస్స్ వే!
కాగా.. భారీ సైనిక విమానాల బరువు, ఒత్తిడిని భరించేందుకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేయబడిన పదార్థాలను ఉపయోగించి ఈ ఎయిర్ స్ట్రిప్ అభివృద్ధి చేయబడింది. ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు, ప్రముఖులతో పాటు 500 మంది స్కూలు పిల్లలు ప్రారంభోత్సవానికి హాజరై ఈ వైమానిక ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పించారు.
