అమ్మ ట్రంపూ... భారత్- పాక్ సీజ్ ఫైర్ వెనుక ఇంత కథ ఉందా?
భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 శనివారం సాయత్రం 5 గంటల తర్వాత చీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి
By: Tupaki Desk | 25 May 2025 9:30 AM ISTభారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 శనివారం సాయత్రం 5 గంటల తర్వాత చీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఈ కాల్పుల విరమణ ప్రకటనను భారత్, పాక్ కంటే ముందు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ కాల్పుల విరమణకు కారణం తన మధ్యవర్తిత్వం అని చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు మాగొప్పగా ఆలోచించారంటూ కొనియాడారు. రెండు రోజుల తర్వాత.. తాను వ్యాపారం, వాణిజ్యం పేరు చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పుకున్నారు! దీనిపై భారత్ కౌంటర్ ఇచ్చినా.. ఆ స్వోత్కర్ష కొనసాగించారు. ఆనంతరం, కశ్మీర్ విషయంలోనూ కల్పించుకుంటానన్నారు.. పక్కకెళ్లి ఆడుకోమని భారత్ సూటిగా చెప్పేసింది!
ఈ కాల్పుల విరమణ అనంతరం.. రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని మళ్లీ మొదలుపెట్టారు ట్రంప్. ఆ సంగతి అలా ఉంటే... ఈ కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ ఎంటర్ అవ్వడానికి కారణం.. పాకిస్థాన్ వెళ్లి ప్రపంచ దేశాల ముందు సాష్టాంగ పడటమే అని భారత్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఈ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంత పట్టుబట్టడానికి అసలు పర్సనల్ రీజన్ ఒకటుందనే విషయం తాజాగా చర్చల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా... పాక్ ఎన్ని క్షిపణులను ప్రయోగించినా బలంగా అడ్డుకుంటోన్న రష్యా మేడ్ “ఎస్-400”, భారత్ మేడ్ “ఆకాష్” గగనతల రక్షణ వ్యవస్థలు అని అంటున్నారు!
అవును... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా రెండు గగనతల రక్షణ వ్యవస్థలపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... ప్రధానంగా ఒకటి రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న “ఎస్-400” కాగా.. భారత్ స్వదేశంగా అభివృద్ధి చేసిన “ఆకాశ్” గగనతల రక్షణ వ్యవస్థ మరొకటి.
ఈ సందర్భంగా ఈ రెండు గగనతల రక్షణ వ్యవస్థలపైనా ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. పాకిస్థాన్ సుమారు 1000 వరకూ డ్రోన్ లను, వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినా.. అందులో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు! అందుకు గల కారణం.. భారత్ గగనతలంలో ఎస్-400, ఆకాష్ లు వాటికి అడ్డంగా నిలబడిపోయాయి! దీంతో.. చైనా మేడ్ డ్రోన్లు చతికిలపడిపోయాయి!
దీంతో... చైనా, పాకిస్థాన్ కంటే ఎక్కువగా అమెరికా కుమిలిపోయిందని అంటున్నారు! ఈ ప్రపంచంలో తనకంటే ఏ విషయంలో మరే ఇతర దేశమూ ముందుండకూడదు, అభివృద్ధి చెందకూడదు అనే లక్షణం ప్రధానంగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికాకు ఉందని.. అందుకే సుంకాల పేరు చెప్పి ప్రపంచ దేశాల భవిష్యత్తుపై ట్రంప్ పెత్తనం చేయాలనుకుంటారని అంటుంటారు.
వాస్తవానికి రష్యాతో ఎస్-400 కొనుగోలు సమయంలోనే అమెరికా నుంచి భారత్ కు అనేక ఆంక్షలు, ఒత్తిళ్లు వచ్చాయి. రష్యా చేసిన ఈ రక్షణ వ్యవస్థ.. అమెరికా ప్రయోగించే క్షిపణులను సైతం అడ్డుకోగలగడంతో.. అగ్రరాజ్యానికి కన్నుకుట్టిందని అంటారు. అయితే... అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు! ఒకేసారి ఐదు ఎస్-400 వ్యవస్థలను ఆర్డర్ ఇచ్చింది!
అనంతరం ఈ విషయంపై అమెరికా లైట్ తీసుకుందో.. లేక, తమ వద్ద వాటిని ఛేదించగలిగే క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని భావించిందో తెలియదు కానీ... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా చైనా, తుర్కిష్ తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులను ఈ ఎస్-400, ఆకాష్ విజయవంతంగా నిర్వీర్యం చేయగలగడంతో ట్రంప్ లో ఆందోళన మొదలైందని అంటున్నారు!
ఈ నేపథ్యంలోనే అణ్వాయుధాల పేరు చెప్పో.. ఐఎంఎఫ్ నిధులు ఆశ చూపో.. వాణిజ్యం ఎరవేసో.. సుంకాలతో భయపెట్టో.. భారత్ కు అగ్రరాజ్యంతో స్నేహం అంటూ నక్కబావ కబుర్లు చెప్పో.. తెలియదు కానీ.. యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ తో పాక్ పై దాడిని ఆపగలిగింది.. కాల్పుల విరమణ అంగీకారానికి రప్పించగలిగింది!
కట్ చేస్తే... ఈ ఎస్-400, ఆకాష్ గగనతల రక్షణ వ్యవస్థల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగడం.. వీటిని ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ తో సమానంగా చూడటంతో.. కాల్పుల విరమణ అనంతరం ట్రంప్ ఓ బిగ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గోల్డెన్ డోమ్ తయారు చేస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. దీనికి $175 బిలియన్లు ఖర్చవుతుందని ప్రకటించారు.
ఈ క్రమంలో హుటాహుటిన 25 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఈ డోమ్ నిర్మాణం తన పదవీకాలం (2029) ముగిసేలోపు పూర్తవుతుందని చెప్పుకుంటున్నారు. అయితే... ఈ గోల్డెన్ డోమ్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి 20 ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఐరన్ డోమ్ ను రష్యా, చైనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా శాంతి కబుర్లు, కాల్పుల విరమణ ఒప్పందాలు అంటూ మాట్లాడే ట్రంప్.. తాజాగా గోల్డెన్ డోమ్ నిర్మాణం చేపట్టడం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. ఇది ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తెరపైకి వచ్చిన ఎస్-400, ఆకాష్ ల పెర్ఫార్మెన్స్ ప్రభావమని మరికొంతమంది స్పష్టం చేస్తున్నారు!
