Begin typing your search above and press return to search.

అత్యంత శక్తిమంతమైన పాస్‌ పోర్టుల జాబితాలో పడిపోయిన భారత్‌!

కాగా హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌ జాబితాలో ఫ్రాన్స్‌ మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఫ్రాన్స్‌ పాస్‌ పోర్టు ఉన్న వారు వీసా లేకుండా ఏకంగా 194 దేశాల్లో పర్యటించవచ్చు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 3:58 AM GMT
అత్యంత శక్తిమంతమైన పాస్‌ పోర్టుల జాబితాలో పడిపోయిన భారత్‌!
X

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ ఒక స్థానాన్ని దిగజార్చుకుంది. హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌–2024 పేరిట విడుదలైన ఈ జాబితాలో భారత్‌ గతేడాదితో పోలిస్తే ఒకస్థానం పడిపోయింది. గతేడాది 84వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 85వ ర్యాంకుకు దిగజారింది. భారతీయ పాస్‌ పోర్టు ఉన్నవారికి వీసా లేకపోయినా అనుమతించే దేశాల సంఖ్య ఈ ఏడాది పెరిగినా భారత్‌ ర్యాంకు పడిపోయింది. వీసాలేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించొచ్చన్న అంశం ఆధారంగా హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌ జారీ చేస్తారు.

ప్రస్తుతం భారతీయులకు 60 దేశాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తున్నాయి. ఇటీవల థాయ్‌ల్యాండ్, మలేషియా, ఇరాన్‌ కూడా ఈ దేశాల జాబితాలో చేరాయి. వీసా లేకుండా భారతీయులు ఈ దేశాలకు సైతం వెళ్లొచ్చు.

కాగా హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌ జాబితాలో ఫ్రాన్స్‌ మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఫ్రాన్స్‌ పాస్‌ పోర్టు ఉన్న వారు వీసా లేకుండా ఏకంగా 194 దేశాల్లో పర్యటించవచ్చు. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్‌ కూడా 194 దేశాల్లో పర్యటించడానికి అవకాశం ఉంది. స్వీడన్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్‌ దేశస్తులు 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.

నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఐర్లాండ్‌ 192 దేశాలకు, యునైటెడ్‌ కింగ్‌ డమ్, లగ్జెంబర్గ్, పోర్చుగల్, బెల్జియం, నార్వే దేశస్తులు వీసా లేకుండా 191 దేశాలకు వెళ్లొచ్చు. అమెరికా, హంగరీ, కెనడా దేశస్తులు 188 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు.

ఇక మన దాయాది దేశం పాకిస్థాన్‌ 106వ స్థానానికి పడిపోయింది. ఇటీవల భారత్‌ తో దౌత్యవివాదంతో వార్తల్లో నిలిచిన మాల్దీవులు మాత్రం ఏకంగా 58వ స్థానంలో నిలవడం గమనార్హం. మాల్దీవుల పాస్‌ పోర్టు ఉన్న వారు వీసా లేకుండా 96 దేశాల్లో పర్యటించవచ్చు. భారత్‌ కు మరో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ 102వ స్థానంలో నిలిచింది.

గత 19 ఏళ్ల డేటా ఆధారంగా హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌ ను తయారు చేస్తారు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ అందుబాటులో ఉంచే సమాచారం ఈ సూచీ రూపకల్పనకు ఆధారం. ప్రతి నెల ఈ డేటాను కొత్త సమాచారంతో అప్‌ డేట్‌ చేస్తుంటారు.

ప్రపంచంలో మొత్తం 199 దేశాల్లోని 227 ప్రయాణ గమ్యస్థానాల సమాచారాన్ని డేటాలో పొందుపరుస్తారు. ఈ డేటాకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గుర్తింపు ఉంది. 2006లో ప్రజలు సగటున 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడీ సంఖ్య దాదాపు రెట్టింపై 111కు చేరుకుంది.