Begin typing your search above and press return to search.

భారత్ తో పెట్టుకుంటే అంతే.. గుడ్లు తేలేసిన పర్యటక ద్వీప దేశం

నవంబరు వరకు భారత్ కు చెందిన లక్షద్వీప్ కు ఆవల ఉండే మాల్దీవులు మంచి మిత్రదేశమే.

By:  Tupaki Desk   |   7 Jan 2024 11:26 AM GMT
భారత్ తో పెట్టుకుంటే అంతే.. గుడ్లు తేలేసిన పర్యటక ద్వీప దేశం
X

ఇక ఆ ప్రఖ్యాత ద్వీపాలకు ఇక భారత పర్యటకులు వెళ్లనట్టే..? ఆ దీవులు మహా అయితే 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి.. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా 185వ దేశం.. కానీ అక్కడి ప్రదేశాలు పర్యటకానికి స్వర్గధామాలు.. అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. అందుకే భారతీయులంతా పొలోమంటూ వెళ్తుంటారు. ఒకవిధంగా ఆ ద్వీప దేశ ఆదాయంలో పర్యటకానిదే ప్రధాన పాత్ర అయితే.. అందులో భారతీయుల వాటానే అధికం. ఇకపై మాత్రం భారత్ కొట్టిన దెబ్బకు కోలుకునే పరిస్థితుల్లో లేదు. మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుజువు చేసే ఉదంతం ఇది.

నవంబరు వరకు భారత్ కు చెందిన లక్షద్వీప్ కు ఆవల ఉండే మాల్దీవులు మంచి మిత్రదేశమే. అక్కడి అందాలను వీక్షించడం కోసం లక్షలాది మంది మనవాళ్లు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా వీరిలో ఉండేదవారు. నవంబరులో ఎన్నికలు జరిగిన మాల్దీవుల ప్రభుత్వం మారింది. అంతే.. పరిస్థితులు అంతా మారిపోయాయి. మాల్దీవుల ప్రధానిగా భారత్ కు అంత అనుకూలుడు కాని నాయకుడు ఎన్నికయ్యాడు. అక్కడ ఉన్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని కోరాడు. దీనికి ప్రతిగా భారత్ సరైన దెబ్బకొట్టింది.

ప్రధాని మోదీ గత వారం కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌‌లో సముద్రం ఒడ్డున సేద తీరడంతో పాటు స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు లక్ష ద్వీప్‌ నకు రావాలంటూ సూచించారు. పరోక్షంగా మాల్దీవులను దెబ్బకొట్టే ఉద్దేశంలో ఇందులో ఉంది. అయితే, మోదీ మాటలపై మాల్దీవుల ఎంపీ జహీద్‌ రమీజ్‌ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్‌ ఎన్నో సమస్యల్లో ఉందంటూ ట్వీట్ చేశారు. తమలాగా సర్వీసుల్ని అక్కడ అందించలేరని, లక్షద్వీప్ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని విమర్శలతో ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. మాల్దీవులను బాయ్‌ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ మాల్దీవుల ట్రిప్‌ రద్దు చేసుకున్నారు. సెలెబ్రిటీలు సైతం ఇందులోకి చేరిపోయారు. దీంతో.. #BoycottMaldives అనే హ్యాష్‌ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

బాలీవుడ్ సెలబ్రిటీలూ..

#BoycottMaldives ట్రెండ్‌ కు మద్దతు ఇస్తూ కొందరు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని.. అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశం పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. పొరుగువారితో మనం మంచిగా వ్యవహరిస్తుంటే, వాళ్లు ద్వేషం ప్రదర్శిస్తున్నారని.. సొంత పర్యాటకానికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందామని పిలుపునిచ్చారు. హీరోయిన్ శ్రద్ధాకపూర్ సైతం.. లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌ లు, తీరప్రాంతాలు ఉన్నాయని, సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ ట్రెండ్‌లోకి దిగి.. లక్షద్వీప్‌లోని అందమైన బీచ్‌ల్లో ప్రధాని మోదీ సందర్శించడం చూసి ఆనందంగా ఉందని, ఇది మన భారత్‌లోనే ఉండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఇలా ఇతర సెలెబ్రిటీలు లక్షద్వీప్‌కి మద్దతుగా ట్వీట్ చేస్తూ.. మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

క్రికెట్ దేవుడు సచిన్ సైతం..

#BoycottMaldives కు మద్దతుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేస్తూ, అనుభవాలను పంచుకున్నారు. ఈ తీరప్రాంతం మనం కోరుకునే దాని కన్నా ఎక్కువగా ఇస్తుందని, అద్భుతమైన ఆతిథ్యంతో కూడిన ఈ అందమైన ప్రదేశాలు అనేక మధురానుభూతులను మిగిల్చాయని కొనియాడారు.

ఈ పరిణామాల మధ్య మాల్దీవుల్లో 7,500 హోటల్ బుకింగ్స్, 2,300 పైగా విమాన టికెట్లు రద్దయినట్లు సమాచారం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ఐదేళ్లలోనే మాల్దీవులను వెనక్కునెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.