Begin typing your search above and press return to search.

చంద్రయాన్‌-3 ఘనవిజయం.. విదేశీ నేతల ప్రశంసల వెల్లువ!

జాబిల్లి ర హస్యాలను, గుట్టుమట్లను తెలుసుకోవడానికి భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Aug 2023 7:35 AM GMT
చంద్రయాన్‌-3 ఘనవిజయం.. విదేశీ నేతల ప్రశంసల వెల్లువ!
X

జాబిల్లి ర హస్యాలను, గుట్టుమట్లను తెలుసుకోవడానికి భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న భారత్‌ ఈ ప్రయోగాన్ని చేపట్టగా ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్‌ ద్వారా పంపిన ల్యాండర్‌ జాబిల్లిని ముద్దాడింది. దీంతో చంద్రుడిపై ల్యాండర్‌ ను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర పుటలకెక్కింది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను దింపిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది.

ఈ నేపథ్యంలో భారత్‌ కు ఇంటా బయట ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దీన్ని అద్భుతమైన ఫీట్‌ గా అభివర్ణించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భారత్‌ పై ప్రశంసలు కురిపించారు.

'చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్‌-3 చారిత్రాత్మకంగా ల్యాండింగ్‌ చేసినందుకు భారతదేశానికి అభినందనలు. అమెరికా, సోవియట్‌ యూనియన్, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది' అని కమలా హారిస్‌ కొనియాడారు. 'ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఇంజనీర్లందరికీ ఇది ఒక అద్భుతమైన ఫీట్‌. ఈ మిషన్‌ లో, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ తో భాగస్వాములైనందుకు గర్విస్తున్నాం' అని కమల అభినందనలు తెలిపారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా అధిపతి నెల్సన్‌ కూడా భారత్‌ ను అభినందించారు. 'మీ విజయవంతమైన చంద్రయాన్‌-3 చంద్రుడి సౌత్‌ పోల్‌ పై ల్యాండ్‌ అయినందుకు నా అభినందనలు. ఈ క్రమంలో నాలుగో విజయవంతమైన దేశంగా నిలిచినందుకు నా ప్రశంసలు. ఈ మిషన్‌ లో మీ భాగస్వామి అయినందుకు మేము సంతోషిస్తున్నాము!' అంటూ ఆయన ట్విట్టర్‌ లో ప్రశంసలు కురిపించారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరై ప్రస్తుతం భారతదేశంలో ఉన్న భారతీయ–అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా కూడా చంద్రయాన్‌-3 విజయం పట్ల ప్రశంసలు కురిపించారు. ఇది భారత దేశానికి 'పెద్ద క్షణం' అని అభివర్ణించారు. 'నేను ఇటీవల నాయకత్వం వహించిన ప్రతినిధి బృందంతో భారతదేశం అంతటా అద్భుతమైన చాతుర్యం, చైతన్యాన్ని చూశాను' అని ఖన్నా చెప్పారు.

అలాగే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ కూడా భారత్‌ ను అభినందించారు. 'చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 చారిత్రాత్మకంగా ల్యాండింగ్‌ చేసినందుకు ఇస్రో, భారతదేశ ప్రజలకు అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనలో భారతదేశంతో మా భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా భారతదేశంలోని యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి.. చంద్రయాన్‌-3 విజయాన్ని కొనియాడారు. ల్యాండర్‌ ను చంద్రుడిపై విజయవంతంగా దింపినందుకు అభినందనలు తెలిపారు. భారత్, అమెరికా కలసి చేపట్టబోయే ఉత్తేజకర అంశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

చంద్రుని దక్షిణ ధ్రువంపై క్రాఫ్ట్‌ ను దింపిన మొదటి దేశం భారతదేశం అని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు బ్రాడ్‌ షెర్మాన్‌ కొనియాడారు.

కాగా చంద్రయాన్‌-3 విజయవంతమైన నేపథ్యంలో సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ఆదిత్య ఎన్‌-1 సుమారు 15 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి దాదాపు 120 రోజులు పడుతుంది.