Begin typing your search above and press return to search.

భారత్‌ ఆ పని చేయాల్సిందే: మళ్లీ అమెరికాది అదే తీరు!

కెనడాలో ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారం భారత్‌ - కెనడా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:51 AM GMT
భారత్‌ ఆ పని చేయాల్సిందే: మళ్లీ అమెరికాది అదే తీరు!
X

కెనడాలో ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారం భారత్‌ - కెనడా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. అంతేకాకుండా భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. దీనికి దీటుగా ప్రతిస్పందించిన భారత్‌.. తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తను దేశం విడిచిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కెనడా పౌరులకు భారత వీసాల జారీని కూడా నిలిపేసింది.

మరోవైపు నిజ్జర్‌ హత్య వ్యవహారంలో తమ దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని కెనడా డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా జస్టిన్‌ ట్రూడో తమ మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు భారత్‌ పై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మొదట్లో ఆచితూచి వ్యవహరించిన అమెరికా ఆ తర్వాత మెల్లిగా స్వరం పెంచడం ప్రారంభించింది. కెనడా తేలికగా ఆరోపణలు చేయదని.. కెనడా ఆరోపణలపై భారత్‌ దృష్టిపెట్టాలని సూచించింది.

ఈ నేపథయంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైంకర్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తో సమావేశం కానున్నారు. ఖలిస్థానీ అంశంలో భారత్‌-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, కెనడా చెప్పినట్టు చేయాలని అమెరికా మనకు సూచిస్తున్న వేళ ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే భారత్‌-కెనడా దౌత్య వివాదం'పై మరోమారు అమెరికా తన వాదనను పునరుద్ఘాటించింది. కెనడా దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని కోరింది.

అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 28న జైశంకర్‌-బ్లింకెన్‌ భేటీ కానున్నారు. వీరి సమావేశంలో 'భారత్‌-కెనడా' అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజాగా హాట్‌ కామెంట్స్‌ చేశారు. బ్లింకెన్‌-జైశంకర్‌ చర్చల ఎజెండా గురించి తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపారు. ఇప్పటికే కెనడా అంశంలో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా వెల్లడించామని చెప్పారు. ఈ వ్యవహారాన్ని భారత్‌ వద్ద ప్రస్తావించామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని కోరామన్నారు.

కాగా ఐరాస వార్షిక సర్వసభ్య సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన జైశంకర్‌.. ఇప్పటికే అమెరికా మంత్రి బ్లింకెన్‌ తో ఒక అనధికారికంగా ఒకసారి సంభాషించారు. అప్పట్లో వీరి మధ్య కెనడా అంశం చర్చకు రాలేదు. అలాగే కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌ లో జరిగిన క్వాడ్‌ (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. మరోవైపు నిజ్జర్‌ హత్యపై నిఘా సమాచారాన్ని కూడా అమెరికానే కెనడాకు ఇచ్చినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు రావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రుల భేటీలో అమెరికా ఈ ప్రస్తావన తెస్తే భారత్‌ ఎలా ప్రతిస్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని అమెరికా సూచించినా భారత్‌ లక్ష్యపెట్టలేదు. అలాగే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని సూచించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం భారత విదేశాంగ విధానం గతంలో మాదిరిగా లేదు. అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. అలాగే వేరే ఎవరైనా ఢీ అంటే ఢీ అనేలానే వ్యవహరిస్తోంది. అది అమెరికా అయినా సరే. ఈ నేపథ్యంలో భారత్‌ - అమెరికా విదేశాంగ మంత్రుల సమావేశం ఆసక్తి రేపుతోంది.