Begin typing your search above and press return to search.

కెనడాకు భారత్‌ మరో ఝలక్‌!

తమ దేశంలో ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కలకలం రేపిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 9:54 AM GMT
కెనడాకు భారత్‌ మరో ఝలక్‌!
X

తమ దేశంలో ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కెనడాలో భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా తన మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు భారత్‌ పై కెనడా ప్రధాని ఫిర్యాదులు చేశారు. నిజ్జర్‌ హత్య వ్యవహారంలో తమ దర్యాప్తుకు భారత్‌ కూడా సహకరించేలా ఒత్తిడి తేవాలని మిత్ర దేశాలను కోరారు.

ఈ నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని అమెరికా కోరింది. ఈ విషయమై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగం భారతదేశ అధికారులతో మాట్లాడినట్టు అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ జరిపిన అమెరికా పర్యటనలోనూ ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌.. కెనడాకు సహకరించాలని సూచించారు. ఈ విషయాన్ని జైశంకర్‌ సైతం ధ్రువీకరించారు.

ఇప్పుడు తాజాగా భారత్, కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ను ఓ పాక్‌ విలేకరి ప్రశ్నించారు. దీనికి మిల్లర్‌ స్పందిస్తూ.. దీనిపై తమ వైఖరిని గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఈ వ్యవహారంపై కెనడాతో తాము సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడించారు. కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని తాము పలుమార్లు సూచించామన్నారు. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో జరిపిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు అని మిల్లర్‌ వెల్లడించారు.

మొదట్లో కెనడా ఫిర్యాదుపై పెద్దగా స్పందించని అమెరికా ఆ తర్వాత తన గొంతును సవరించుకుంది. కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని పదేపదే కోరడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నిజ్జర్‌ హత్యపై నిఘా సమాచారాన్ని కూడా అమెరికానే కెనడాకు ఇచ్చినట్లు ఆ దేశ పత్రికల్లో కథనాలు సైతం వెలువడటం తెలిసిందే.

మరోవైపు భారత్‌.. కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. నిజ్జర్‌ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భారత్‌ దౌత్యవేత్తను బహిష్కరించినందుకు ప్రతిగా కెనడా దౌత్యవేత్తను ఇండియా నుంచి బహిష్కరించింది. ఆ దేశానికి వీసాల జారీని కూడా నిలిపేసింది. ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారిందని.. ఇప్పటికే అక్కడ ఉన్న భారత పౌరులు జాగ్రత్తలు వహించాలని ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది.

తాజాగా ప్రస్తుతం భారతదేశంలో కెనడా దౌత్య సిబ్బందిని భారీగా తగ్గించుకోవాలని భారత్‌.. కెనడాను కోరింది. అక్టోబర్‌ 10లోగా 40 మందిని సిబ్బంది వెనక్కి పిలిపించుకోవాలని సూచించింది. ఈ మేరకు కెనడాకు భారత్‌ ఆల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడాకు సూచించింది. కెనడాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే భారత్‌ లో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్‌ లైన్‌ విధించినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌ లో కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 40 మందిని కెనడా వెనక్కి పిలిపించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.

అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఫైనాన్షియల్స్‌ టైమ్స్‌ పేర్కొంది. అయితే, ఈ వార్తలపై అటు కెనడా గానీ, ఇటు భారత్‌ గానీ అధికారికంగా స్పందించలేదు.