Begin typing your search above and press return to search.

వారానికి 5 రోజులే బ్యాంకులు పని చేయనున్నాయా?

By:  Tupaki Desk   |   22 July 2023 4:27 AM GMT
వారానికి 5 రోజులే బ్యాంకులు పని చేయనున్నాయా?
X

ఏళ్లుగా సాగుతున్న డిమాండ్ కు ముగింపు పలికే వాతావరణం నెలకొంది. వారానికి ఆరు రోజులు.. నెలలో రెండు వారాలు ఐదు రోజులు మాత్రమే పని చేసే బ్యాంకులు.. మరికొద్ది రోజుల్లో వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ మధ్యనే ఎల్ ఐసీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసేలా నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో.. బ్యాంకు ఉద్యోగులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పని దిశగా నిర్ణయాన్ని తీసుకునేందుకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ తో ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కీలక భేటీని నిర్వహించనున్నారు. ఈ సమావేశం జులై 28న జరగనుంది.

బ్యాంకు ఉద్యోగుల వేతనాల పెంపు.. పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలపై చర్చించేందుకు జులై 28న భేటీ అవుతున్నట్లు చెబుతున్నా.. ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగేది మాత్రం బ్యాంకింగ్ సిబ్బంది వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే అంశంపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. బ్యాంకు పని దినాలు వారానికి ఐదు రోజులు పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అయితే.. వారానికి ఒక రోజు పని తగ్గుతున్న నేపథ్యంలో.. ఇందుకు బదులుగా ఐదు రోజుల పాటు మరో నలభై నిమిషాలు అదనంగా పని చేసేలా ప్లాన్ చేస్తారని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. అసలు సమస్య వేరే ఉందంటున్నారు. ఇప్పటికే పలు విభాగాల ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారు తమకు ఏదైనా బ్యాంకు పనులు ఎదురైతే.. వారం మధ్యలో సెలవు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కీలకమైన ఐటీ ఉద్యోగులు తమ బ్యాంకింగ్ పనుల్ని ఇప్పటివరకు శనివారం చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసిన పక్షంలో మరిన్ని ఇబ్బందులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. బ్యాంకింగ్ వర్గాల వాదన మరోలా ఉంది. ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా.. బ్యాంకులకు నేరుగా రావాల్సిన అవసరం బాగా తగ్గిందని చెబుతున్నారు.

అయితే.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటాయని.. ఆ విషయాన్ని బ్యాంకింగ్ వర్గాలు పట్టించుకోవటం లేదన్నది ప్రజల వాదన. అయితే.. దీనికో పరిష్కారం ఉందని.. ఐదు రోజుల పని విధానంలో సెలవును శని.. ఆదివారాల్లో కాకుండా ఆది.. సోమ వారాలకు మారిస్తే బాగుంటుందని చెబుతున్నా.. ఆచరణ అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. ఈ రెండు వాదన నేపథ్యంలో తుది నిర్ణయం ఏ రీతిలో ఉంటుందో చూడాలి.