Begin typing your search above and press return to search.

2099 నాటికి మనలో.. ప్రతి ముగ్గురిలో ఒకరు వృద్ధులే

ఇప్పటివరకు భారత్ అంటే.. యువ రక్తం ఉరకలెత్తుతున్న దేశం. ప్రపంచంలో మరే దేశానికీ లేనటువంటి ప్రత్యేకత భారత్ సొంతం

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:30 PM GMT
2099 నాటికి మనలో.. ప్రతి ముగ్గురిలో ఒకరు వృద్ధులే
X

ఇప్పటివరకు భారత్ అంటే.. యువ రక్తం ఉరకలెత్తుతున్న దేశం. ప్రపంచంలో మరే దేశానికీ లేనటువంటి ప్రత్యేకత భారత్ సొంతం. ఓ అంచనా ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం సగం వరకు యువతే. నడి వయస్కులు సైతం భారీగా ఉన్న దేశం భారత్. సహజంగానే వీరంతా పనిచేసే వయసు వారు కావడంతో ప్రపంచంలో మన దేశం వివిధ సంస్థలకు పెద్ద మార్కెట్ గా అవతరించింది. మరోవైపు మున్ముందు పరిస్థితి ఏమిటి..? ఇది ఎవరైనా ఊహించేదే కదా..? నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు.. నేటి యువతే రేపటి వృద్ధులం. ఇది కాదనలేని సత్యం. ఇదే మాట చెబుతోంది ఐక్యరాజ్య సమితి.

జపాన్, చైనా తరహాలో..

ఆర్థికంగా పెద్ద శక్తి అయిన జపాన్, పారిశ్రామికంగా ముందున్న చైనా ప్రస్తుతం అధిక వృద్ధ జనాభా ఉన్న దేశాలు. ఇది ఒకరకంగా వాటి శ్రామిక శక్తి మందంగించేందుకు కారణం అవుతోంది. అయితే, ఈ దశ కొన్నాళ్లే. వృద్ధ జనాభా క్రమంగా తగ్గి.. కొత్త తరం వస్తే ఈ దేశాలు మళ్లీ పుంజుకొంటాయి. జపాన్, చైనా అనే కాదు.. ఏ దేశానికైనా ఇది సహజం. అయితే, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఈ రెండు దేశాల జనాభా (పనిచేసే వయసువారు) గురించి చర్చ జరుగుతోంది.

మరి భారత్ సంగతి ఏమిటో..?

మన దేశం ఇప్పటివరకైతే అత్యధిక యువ జనాభా ఉన్నదిగా ప్రత్యేకంగా నిలుస్తోంది. కానీ, కొన్నాళ్లుగా వయోధికుల సంఖ్య విస్తరించడం మొదలైంది. క్రమానుగతంగా జరిగే వయసు పెరుగుదల రీత్యా ఇది సహజ ప్రక్రియగానే దీనిని భావించాలి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. ఈ శతాబ్ది చివరినాటికి భారత్ లో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని ‘ఐక్యరాజ్య సమితి జనాభా నిధి’ (యూఎన్‌ ఎఫ్‌ పీయే) నివేదిక చెబుతోంది.

నేటి బాలలే రేపటి పౌరుల తరహాలో..

ప్రపంచంలో ఎక్కువమంది కిశోర ప్రాయం (11-14 ఏళ్లు), యువత ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఇక 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 2021లో 10.1% ఉంటే 2036 నాటికి 15 శాతానికి, 2050కి 20.8 శాతానికి చేరతాయరని ఐక్యరాజ్య సమితి నివేదిక. 2099 నాటికి ఇది ఎకాయెకి 36 శాతానికి చేరుతుందటం.

13 ఏళ్లుగా తగ్గుతున్న పిల్లలు

భారత్ లో 2010 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోవడం, వయోధికులు పెరగడం మొదలైంది. దేశానికి వృద్ధాప్యం వస్తోందనడానికి ఇదే సూచిక. 'ఎక్కువ వయసున్నవారి జనాభా అనూహ్య రేటుతో పెరుగుతోంది. ఈ శతాబ్ది మధ్యనాటికే వీరి సంఖ్య పిల్లల కంటే ఎక్కువైపోతుంది. 2046 నాటికి 0-14 ఏళ్లలోపువారి సంఖ్య కంటే వృద్ధుల జనాభా ఎక్కువవుతుంది. యువ భారత్‌ కాస్తా వయసుమీరిన భారత్‌గా మారుతుందనేది నిస్సందేహం' అని యూఎన్‌ఎఫ్‌పీయే చెప్పింది.

రాష్ట్రాలవారీగా ఇలా..

ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం.. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 2021 జాతీయ సగటు కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, 2036 నాటికి మరింత విస్తరిస్తుందని జనాభా నిధి అంచనాలు చెబుతున్నాయి. ఎక్కువ సంతాన సాఫల్య రేటు ఉంటున్న బిహార్‌, యూపీ వంటి రాష్ట్రాల్లో 2021-36 మధ్య వృద్ధుల జనాభా శాతం జాతీయ సగటు కంటే తక్కువ ఉంటుంది. 1961 నుంచి ప్రతి దశాబ్దిలో వయోధికుల సంఖ్య ఒక మోస్తరు నుంచి అధికస్థాయి వరకు పెరుగుతూ వస్తోంది. 2001కి ముందు ఈ పెరుగుదల నెమ్మదించినా రాబోయే దశాబ్దాల్లో ఊపందుకుంటుంది. - 2021 జనాభా అంచనాల ప్రకారం దేశంలో ప్రతి 100 మందిలో 39 మంది వృద్ధులున్నారు. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాలతో పోలిస్తే మధ్య, ఈశాన్య భారత ప్రాంతాల్లో యువత ఎక్కువగా ఉన్నారు.