2025.. 52.. పచ్చబొట్టు చెరిగిపోదులే..హర్మన్ టాటూ..లోతైన అర్థం
దాదాపు 50 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే.. టీమ్ ఇండియా మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ కల ఎట్టకేలకు ఇప్పటికి నెరవేరింది..!
By: Tupaki Desk | 6 Nov 2025 4:00 AM ISTదాదాపు 50 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే.. టీమ్ ఇండియా మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ కల ఎట్టకేలకు ఇప్పటికి నెరవేరింది..! ఫైనల్ చేరిన మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది..! పురుషుల క్రికెట్ లో మూడో ప్రపంచ కప్ నే గెలుచుకుంది భారత్. మహిళల విషయానికి వస్తే 13వ సారి కాని సాధ్యం కాలేదు. అయితే, ఇప్పటివరకు ఒక లెక్క..
ఇకనుంచి ఒక లెక్క అన్నట్లుగా భారత మహిళల జట్టు కథ మారిపోనుంది. 1983లో పురుషుల జట్టు ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత మన దేశంలో క్రికెట్ ఎంతగా మారిపోయిందో చూశాం..! అందుకనే ఈ విజయం మహిళలకు మరపురానిది.. అందరికంటే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు. దానిని ఆమె కూడా అంతే గొప్పగా నిలిచేలా చేసింది..!
అప్పుడు అద్భుతంగా ఆడినా..
టీమ్ ఇండియా మహిళలు 2005, 2017లలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరారు. ఆ రెండుసార్లూ హైదరాబాదీ మిథాలీ రాజ్ కెప్టెన్ గా ఉంది. అయితే, కప్ కల మాత్రం నెరవేరలేదు. 2017లో సెమీఫైనల్, ఫైనల్లో హర్మన్ 171, 51 పరుగులు చేసింది. అంటే, రెండు నాకౌట్ మ్యాచ్ లలోనూ సెంచరీ, హాఫ్ సెంచరీలు కొట్టింది. కానీ, ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో ఓడింది. ఈసారి కెప్టెన్ గా హర్మనే ఉంది. పైగా సొంతగడ్డపై కప్ జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత్ జగజ్జేత అయింది. 36 ఏళ్లు హర్మన్ వచ్చే ప్రపంచ కప్ ఆడడం కష్టమే. అందుకనే ఆమెకు ఈ టైటిల్ జీవితాంతం గుర్తుంటుంది.
ఆ రెండు అంకెలు..
హర్మన్ తాజాగా ప్రపంచ కప్ విజయం అనంతరం తన చేతిపై టాటూ (పచ్చ బొట్టు) వేయించుకుంది. ఇందులో ట్రోఫీ గెలిచిన సంవత్సరం 2025తో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలిచిన పరుగుల వ్యత్యాసం (52) కూడా ఉన్నాయి. ఇక నుంచి నా చర్మంతో పాటు, నా గుండెలో ఎప్పటికీ గుర్తుంటుంది. తొలి రోజు నుంచి దీనికోసం ఎదురుచూశా. ఇక రోజూ ఉదయమే చూసుకుంటా అని కామెంట్ జోడించింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). అంతేగాక హర్మన్ క్రికెట్ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోను సైతం షేర్ చేసింది. తన తండ్రి కిట్ నుంచి బ్యాట్ తీసి ఆడడం మొదలుపెట్టానని, అది బరువుగా ఉండేదని హర్మన్ తెలిపింది. తన ఇష్టాన్ని చూసి చివరకు ఆయన తేలికైన బ్యాట్ ను కొనిచ్చిన సంగతిని పేర్కొంది.
