'దుర్మార్గపు అజెండా'... ప్రపంచ వేదికపై పాక్ కు ఇచ్చిపడేసిన భారత్!
అవును.. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను విమర్శిస్తూ, ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించాలనే పాకిస్థాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు.
By: Tupaki Desk | 26 Jun 2025 1:12 PM ISTతప్పులన్నీ తనవద్ద పెట్టుకున్ని, నేరాలన్నీ తాను చేస్తూ, మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ ను విమర్శిస్తూ.. ఇతర దేశాలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు నిత్యం చేస్తుంటుంది పాకిస్థాన్. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా అదే ప్రయత్నం చేసింది, ఈ గ్యాప్ లో భారత్ ఇచ్చి పడేసింది.
అవును.. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను విమర్శిస్తూ, ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించాలనే పాకిస్థాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐరాస భద్రతా మండలిలో 'పిల్లలు, సాయుధ సంఘర్షణ' అంశంపై బహిరంగంగా చర్చ సందర్భంగా... పాక్ రాయబారి చేసిన తప్పుడు వ్యాఖ్యలను భారత్ ఎండగట్టింది.
ఇందులో భాగంగా... ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన దుర్మార్గపు అజెండాను ముందుకుతీసుకెళ్లడానికి భారత్ ను కించపరుస్తోందని.. ఐరాస నివేదికలో పేర్కొన్నట్లుగా పాక్ లోని పిల్లలపై జరుగుతున్న దారుణాలు, సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టి మళ్లించేందుకు అది ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో... సీఏఏసీ అజెండాను తీవ్రంగా ఉల్లంఘించే దేశాలలో పాకిస్థాన్ ఒకటని చెప్పిన హరీశ్... ఆ దేశ దళాలు సీమాంతర షెల్లింగ్, వైమానిక దాడుల కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆ దేశానికే చెందిన ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడులను ప్రపంచం ఇంకా మరిచిపోలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పహల్గం ఉగ్రదాడిని హరీశ్ ప్రస్థావించారు. ఇందులో భాగంగా... జమ్మూ కాశ్మీర్ లోని పహల్గంలో 2025 ఏప్రిల్ 22న పాకిస్తాన్, పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు జరిపిన దాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని.. ఈ దారుణమైన చర్యకు పాల్పడినవారు, ఆర్థిక సహాయం అందించినవారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఆ దాడులపై ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతిస్పందించిన భారత్ మే 7, 2025న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని.. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించారని అన్నారు. అయితే... ఈ దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ నేరుగా అంత్యక్రియలు నిర్వహించిందని హరీశ్ తెలిపారు.
అలాంటి పాకిస్థాన్ లోని పిల్లలు, ముఖ్యంగా బాలికల పాఠశాలలపై, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న దాడులను గురించి హరీశ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా... జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ఆయన పునరుద్ఘాటించారు.