వాళ్ళందరికీ దుర్మార్గ పాక్ ఉండాలి !
పాకిస్థాన్ పుట్టుక వెనక కుట్ర అందరికీ తెలిసిందే. ఈ రోజున యునైటెడ్ కింగ్ డం గా ఉన్న బ్రిటిష్ పాలకులకు ఆనాడే భారత్ ని శాశ్వతంగా దెబ్బ తీయడానికి అన్నట్లుగా పాక్ ని సృష్టించారు.
By: Tupaki Desk | 10 May 2025 5:00 PM ISTపాకిస్థాన్ పుట్టుక వెనక కుట్ర అందరికీ తెలిసిందే. ఈ రోజున యునైటెడ్ కింగ్ డం గా ఉన్న బ్రిటిష్ పాలకులకు ఆనాడే భారత్ ని శాశ్వతంగా దెబ్బ తీయడానికి అన్నట్లుగా పాక్ ని సృష్టించారు. ఏకాండీగా ఉన్న భారత్ ని ఆక్రమించుకుని రెండు వందల ఏళ్ళ పాటు కర్కశ పాలన సాగించిన బ్రిటిష్ వారు పోతూ పోతూ దేశ విభజన చేసి పోయారు. అఖండ భారత్ ని రెండు ముక్కలు చేశారు.
అది లగాయితూ గడచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత్ ఎక్కడా సుఖపడింది లేదు. పాకిస్థాన్ 1947 ఆగస్టు 14న ఏర్పాటు అయింది. అంటే భారత్ కి ఒక రోజు ముందు అన్న మాట. తన మానాన తాను బతకకుండా భారత్ మీద అదే ఏడాది కయ్యానికి కాలు దువ్వింది. అక్టోబర్ లో అప్పటికి స్వతంత్ర రాజ్యంగా ఉన్న కాశ్మీర్ భారత్ లో కలుస్తామంటే పాక్ ఆ దేశం మీదకు దండెత్తింది.
అలా పాక్ తో భారత్ కి తొలి యుద్ధం వచ్చింది. ఆనాడు కాశ్మీర్ లో మూడవ వంతు భాగాన్ని తీసుకుని నేటికీ తన వద్దనే అట్టేపెట్టుకుని ఉగ్ర మూకలను పెంచి పోషిస్తూ పాక్ భారత్ ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్నీ పెడుతోంది. బయట వారికి కన్ను గప్పి భారత్ మీదకు ఉగ్ర మూకలను ఎగదోసి ప్రచ్చన్న యుద్ధానికి తెగ బడుతూ ఎంత నష్టం చేయాలో అంతా చేస్తూ వస్తుంది.
పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ఒక దుర్గార్మ దేశం అని తెలిసినా తమ అవసరాల కోసం పాక్ ని వాడుకుంటూ వెన్నుదన్నుగా నిలుస్తున్న దేశాలు అనేకం ఉన్నాయి. 1971 యుద్ధంలో అమెరికా చైనా రెండూ పాక్ కి మద్దతు ఇవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. ఇపుడు చూస్తే అమెరికా రెండు నాలుకల ధోరణిలో మాట్లాడుతూంటే చైనా పాక్ కి తెర వెనక సాయం చేస్తోంది. ఇక ముస్లిం దేశాలు ఈ ప్రపంచంలో వందకు పైగా ఉన్నాయి.
ఆ దేశాలకు ఏకైన ముస్లిం ప్రతినిధిగా తనను తాను చెప్పుకుంటూ ఇస్మాలిక్ వరల్డ్ తమ లక్ష్యమని ఆర్భాటం చేస్తూ వారి మద్దతుని ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్ పొందుతోంది. ఇక భారత్ కి రష్యా వంటి దేశాల నుంచి మాత్రమే నిఖార్సు అయిన మద్దతు దక్కుతోంది.
పాక్ ఉగ్రభూతాన్ని పెంచిపోషిస్తుంది అని తెలిసి కూడా ప్రపంచ బ్యాంక్ తాజాగా భారీ రుణాన్ని ఇచ్చింది అంటే ఏమనుకోవాలి. ఇక ఇంతలా భారత్ ని పాక్ వేధిస్తున్న ఒకటి రెండు కాదు డెబ్బై అయిదేళ్ళుగా కాల్చుకుని తింటున్నా ప్రపంచ దేశాలు మాత్రం శాంతి మంత్రం పఠిస్తాయి. రెండు దేశాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుద్దులు చెబుతాయి.
పాక్ అన్నది ఒక దేశంగా ఉందా అన్న ఆలోచన వారికి బహుశా కలగదేమో. కలిగినా వారికి అది అనవసరం. ఒక వైపు ఉగ్రమూకలను భారత్ లోకి పంపిస్తూ మరో వైపు చర్చలకు నవ్వుతూ ముఖం పెడుతూ వచ్చే పాక్ తో భారత్ ముఖాముఖీ భేటీ కావాలా అన్నది ఎవరికీ పట్టని విషయం. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు అంటే ఏమిటి ఇదంతా అనిపిస్తుంది.
ఇంతకీ భారత్ చేసిన పాపం ఏమిటి అన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారా అన్నదే చర్చ. కరోనా వంటి పెను విపత్తు వేళ భారత్ ప్రపంచానికి ఉచితంగా వాక్సిన్ ని ఇచ్చింది. టర్కీ 2023 ప్రకృతి వైపరిత్యంతో అల్లాడిపోతే భారీ సాయం చేసింది కూడా భారత్ దేశమే. నెహ్రూ జమానాలో చైనాకు భారత్ ఎంత చేయాలో అంతా చేసింది. పైగా ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం భారత్ కే వస్తే చైనాకు ఆ చాన్స్ ఇచ్చింది కూడా భారతే. చినీ భారత్ భాయీ భాయీ అంటే చివరికి ఏమి జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. టిబెట్ సహా మహా భూభాగాలను చైనా దురాక్రమణ చేస్తూ 1962లో యుద్ధానికి దిగింది.
ఇక గత అరవై అయిదేళ్ళుగా భారత్ అన్నీ భరిస్తూ సహిస్తూ ఈ రోజున తన దేశం కోసం తన హక్కుల కోసం పాక్ లోని ఉగ్ర క్యాంపులను టార్గెట్ చేస్తే ఏదో కొంప మునిగినట్లుగా పెద్ద దేశాలు ముఖ్య దేశాలు అన్నీ శాంతి అంటున్నాయి. ఈ రోజుకీ ప్రపంచం ముందు ఉగ్ర భూతం భయం ఉంది. పాముకు పాలు పోసి పెంచినట్లుగా తెర వెనక కొందరు తెర ముందు కొందరు పాక్ కి మద్దతు ఇచ్చి నిలబెడుతున్నారు అంటే ఏదో రోజున ప్రపంచ వినాశనానికి వారంతా బాటలు వేస్తున్నట్లే అన్నది ఎందుకు గ్రహించరు అన్నదే ప్రశ్న.
ఈ రోజు భారత్ చేస్తున్న ధర్మ యుద్ధం తన కోసం మాత్రమే కాదు, ఉగ్రభూతం ఈ ప్రపంచాన్ని కబలించకుండా ఉండడం కోసం. అమెరికా సహా పెద్ద దేశాలు అన్నీ కూడా ఉగ్ర బాధితులే. అలాంటపుడు భారత్ కి ఈ రోజు అండగా నిలబడితే రేపటి ప్రపంచం పచ్చగా ఉంటుంది. లేకపోతే మరుభూమిగా మారుతుంది. అయితే ఈ రోజుకు ప్రపంచ పరిణామాలు చూస్తూంటే తెలిసి వస్తోంది ఏంటి అంటే అందరికీ దుర్మార్గ పాక్ కావాలి. మరి ఇండియా ఏమి కావాలి అంటే బహుశా జవాబు భారత్ తానుగా తెలుసుకుని అడుగులు ముందుకు వేయాలేమో.
