భారత్ లో ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
కాగా... ఉప రాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయ సభల్లోని సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా... లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు.. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకూ ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది.
By: Tupaki Desk | 24 July 2025 3:00 AM ISTపార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్యంగా ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్ దీప్ ధన్ ఖడ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు సందేహాలు తెరపైకి తెచ్చింది! ఆ సంగతి అలా ఉంటే... భారత ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ప్రకటించింది.
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్ కు ఆర్టికల్ 324 ప్రకారం ఉందని.. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు 1952 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం.. దాని కింద రూపొందించబడిన నియమాలు.. అంటే 1974 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలు ద్వారా నిర్వహించబడతాయి అని ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది!
కాగా... ఉప రాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయ సభల్లోని సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా... లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు.. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకూ ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. వాస్తవానికి లోక్ సభలో 543 మంది సభ్యులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే... పశ్చిమ బెంగాల్ లోని బసీర్ హాట్ సీటు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఆ సంఖ్య 542గా ఉంది.
ఇక, రాజ్యసభలో 240 మంది ఉన్నారు. వారితో పాటు నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి 244 మంది ఉన్నారు. ఆ విధంగా ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786 (542 + 244)గా ఉంది. ఇందులో ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 394 మంది సభ్యుల మద్దతు అవసరం! ఈ విషయంలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది.
ఇందులో భాగంగా... లోక్ సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలముండగా... రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు. దీంతో... ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే విషయం ఇప్పుడు బీజేపీ కోర్టులో స్పష్టంగా ఉందన్నమాట!
తెరపైకి ఆ ఇద్దరి పేర్లు!:
తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ తెర పైకి రెండు పేర్లు వచ్చాయి! అందులో ఒకటి... బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పేరు కాగా... మరొకటి (కాంగ్రెస్) సీనియర్ ఎంపీ శశిథరూర్.
మరికొన్ని నెలల్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీయే కూటమితో కలిసే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ధన్ ఖడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని జరుగుతోంది. తద్వారా బీహార్ ఎన్నికల్లో గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కించుకోవచ్చని ప్లాన్ అని అంటున్నారు!
మరోవైపు... గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్నట్లు కనిపిస్తున్న శశిథరూర్.. త్వరలో అధికారికంగా హస్తానికి గుడ్ బై చెప్పి, కాషాయ దళంలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది! ఈ క్రమంలోనే తాజా చర్చల్లో శశిథరూర్ పేరు తెర పైకి వచ్చిందని అంటున్నారు.
