Begin typing your search above and press return to search.

టారిఫ్‌ల వేళ అమెరికాతో భారత్ డీల్?

భారత్‌పై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన తొలి ఉన్నతస్థాయి చర్చ ఇదే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   8 April 2025 5:03 PM IST
India Chooses Trade Talks with US
X

టారిఫ్‌ల విషయంలో ప్రపంచ దేశాలు భిన్న వైఖరులు ప్రదర్శిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుంటే, భారత్ మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలు విధించేందుకు బదులుగా, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి సారించింది.

ఈ దిశగా ఇరు దేశాల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

జైశంకర్ తన పోస్ట్‌లో మాట్లాడుతూ, అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో జరిగిన ఫోన్ సంభాషణలో ఇండో-పసిఫిక్, భారత ఉపఖండం, ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్ ప్రాంతాల్లోని పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరంపై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నామని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌పై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన తొలి ఉన్నతస్థాయి చర్చ ఇదే కావడం విశేషం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి పునాదులు పడిన విషయం తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. కొంతకాలంగా దీనిపై చర్చలు జరుగుతుండగా, తాజా పరిణామాలతో త్వరలోనే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

కాగా, అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనీసం 10% నుంచి గరిష్టంగా 49% వరకు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించారు. భారత్ తమ నుంచి 52% సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశంపై 26% టారిఫ్‌లు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ట్రంప్ చర్యకు భారత్ నుంచి ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇదివరకే స్పష్టం చేశాయి.

టారిఫ్‌ల ద్వారా ఒత్తిడి పెంచడానికి బదులుగా, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా పరస్పర ప్రయోజనాలు పొందాలనే భారత వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే, ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఈ చర్చలు మాత్రం ఒక సానుకూల సంకేతంగా పరిగణించవచ్చు. త్వరలోనే భారత్-అమెరికా మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.