అమెరికాకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్.. ఒమన్ తీరంలో అసలేం జరిగింది?
దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఒమన్ కోస్ట్‌గార్డ్ 25 మందిని సురక్షితంగా రక్షించగలిగింది. కానీ, ముగ్గురు భారతీయులు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు.
By: Madhu Reddy | 12 Jun 2026 11:25 PM ISTఅరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం జరుపుతున్న దాడుల అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. ఒమన్ తీరంలో జరిగిన తాజా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా రాయబారిని పిలిపించి మరీ గట్టిగా క్లాస్ పీకడమే కాకుండా, పౌరుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. మన దేశ భద్రత, పౌరుల క్షేమం విషయంలో భారత్ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఒమన్ తీరంలో ఏం జరిగింది?:
బుధవారం ఒమన్ తీర సమీపంలో 'సెట్టిబెల్లో' అనే ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం విరుచుకుపడింది. దేశ పతాకంతో వెళ్తున్న ఈ వాణిజ్య నౌకపై జరిగిన దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, అందులో ఏకంగా 24 మంది భారతీయులే కావడం గమనార్హం. వీరితో పాటు పాకిస్థాన్, ఉక్రెయిన్, రష్యా పౌరులు కూడా ఈ నౌకలో ప్రయాణిస్తున్నారు.
ముగ్గురు భారతీయుల మృతి.. విషాదంలో కుటుంబాలు:
దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఒమన్ కోస్ట్‌గార్డ్ 25 మందిని సురక్షితంగా రక్షించగలిగింది. కానీ, ముగ్గురు భారతీయులు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. గురువారం వారి మృతదేహాలను వెలికి తీయడంతో విషాదం నెలకొంది. ఇక పొట్టకూటి కోసం సముద్ర ప్రయాణాలు చేసే సామాన్యులు ఇలా బలవ్వడం అందరినీ కలిచివేస్తోంది.
అమెరికా రాయబారికి ఇండియా సమన్లు:
ఈ ఘటనపై భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించింది. అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు వాణిజ్య నౌకలపై పదేపదే దాడులు ఎందుకు చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించింది. ఇక గతంలో జరిగిన రెండు ఘటనలతో కలిపి మొత్తం మూడు నౌకలపై అమెరికానే దాడి చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ ఆధారాలతో సహా బయటపెట్టారు.
పౌరుల ప్రాణాలే ముఖ్యం.. భారత్ డిమాండ్:
అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలకు రక్షణ ఉండాలని, ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఇకపై పౌరుల ప్రాణనష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. ఇక కేవలం నిరసన తెలపడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.
మిత్రదేశమే అయినా, మన పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు భారత్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సముద్ర మార్గాల్లో భద్రత అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల క్షేమానికి చాలా అవసరం. మరి భారత్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్‌కు అమెరికా ఎలా స్పందిస్తుందో, ఇకనైనా ఇలాంటి దాడులు ఆగుతాయో లేదో వేచి చూడాలి. మరణించిన భారత నావికుల కుటుంబాలకు మనమందరం ప్రగాఢ సానుభూతి తెలుపుదాం.
