టెక్నాలజీలో తోపులం బాస్.. టాప్ 10 దేశాల్లో భారత్
ఇందులో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ అనే సూచీని రూపొందించింది.
By: Tupaki Desk | 26 Jun 2025 5:02 AMఅవును.. భారత్ దూసుకెళుతోంది. భారతదేశం అంటే కోతులు ఆడించేటోళ్లు.. పాములు పట్టేటోళ్లు లాంటి మాటలు విదేశీయుల నోటి నుంచి పదేళ్ల క్రితం కూడా వినిపించేవి.ఇప్పుడు కాలం మారింది. పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. వివిధ రంగాలతో పాటు సాంకేతిక రంగంలోనూ మన ముద్రను ప్రపంచం మీద స్పష్టంగా చూపిస్తున్న పరిస్థితి. ఈ వాదనకు బలం చేకూరేలా హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కు చెంది బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆఫైర్స్ ఒక రిపోర్టును విడుదల చేసింది.
ఇందులో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ అనే సూచీని రూపొందించింది.ఇందులో ఐదు రంగాల్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ ఐదు రంగాలేమంటే..
1. ఏఐ
2. బయోటెక్నాలజీ
3. సెమీ కండక్టర్స్
4. అంతరిక్షం
5. క్వాంటమ్ టెక్నాలజీ
ఈ విభాగాల్లో ప్రపంచంలోని పలు దేశాల సామర్థ్యం.. సాంకేతిక పురోగతి.. ప్రభుత్వ నియంత్రణ.. అంతర్జాతీయంగా ఏ స్థానంలో ఉన్నారు? మానవ వనరులు.. ఆర్థిక వనరులు లాంటి అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కట్టబెట్టారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఐదు రంగాలకు సంబంధించి టాప్ 10 దేశాల జాబితాలో భారత్ కు చోటు లభించటం. ఇది చాలు.. టెక్నాలజీ పరంగా మనం ఎంత వేగంగా దూసుకెళుతున్నామని చెప్పటానికి.
ఏఐ (కృత్రిమ మేధ) విభాగంలో భారత్ దూకుడు ఒక రేంజ్ లో ఉంది. దేశంలో కృత్రిమ మేధ వినియోగం.. అగ్రరాజ్యాలు అమెరికా.. బ్రిటన్ లతో పోలిస్తే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90 శాతం మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలోని కృత్రిమ మేధ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటగా.. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ లో ఏఐ విభాగంలో జపాన్.. తైవాన్.. సౌత్ కొరియా కంటే మనం ముందున్నాం.
బయోటెక్నాలజీ రంగం విషయానికి వస్తే ప్రపంచంలో భారతదేశం అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. ఈ సూచీలో ఫ్రాన్స్.. తైవాన్.. దక్షిణ కొరియాలను భారత్ అధిగమించిన విషయాన్ని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల తయారీలో వాడే సిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్ వినియోగంలో పది శాతం వాటాను భారత్ సొంతం చేసుకుంది. చిప్ డిజైన్ సౌకర్యాల్లో ప్రపంచంలో ఏడు శాతం మాత్రమే భారత సామర్థ్యం కాగా.. ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20 శాతం మంది భారత్ లో ఉన్నారు. అయితే.. వీరిలో అత్యధికులు అమెరికా.. యూరోప్ దేశాలకు చెందిన సంస్థల కోసం పని చేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్ విభాగంలో ఫ్రాన్స్ కంటే మనం ముందున్నాం.
అంతరిక్ష పరిశోధనల విభాగంలో ప్రపంచంలో 5వ అతి పెద్ద సంస్థగా ఇస్రోకు చోటు దక్కింది. ఈ రంగంలో జపాన్.. దక్షిణ కొరియా.. తైవాన్ కంటే ముందున్నట్లుగా పేర్కొంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లు దరఖాస్తు చేసిన దేశాల్లో భారతదేశం తొమ్మిది స్థానంలో ఉంది. క్వాంటమ్ టెక్నాలజీలో సౌత్ కొరియా.. తైవాన్ కంటే ముందు ఉన్నట్లు వెల్లడైంది.