నవారో.. ట్రంప్ వాణిజ్య యుద్ధ వ్యూహకర్త.. భారత్ పాలిట విలన్
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సలహాదారు నవారో గురించి టెస్లా అధినేత మస్క్ ను అడిగితే బాగా చెబుతారు. అతడిని మూర్ఖుడు అని కూడా అంటారు.
By: Tupaki Desk | 22 Aug 2025 4:04 PM ISTఇండియా టారిఫ్‌ల మహారాజ్.. మనకు వస్తువులు అమ్మి.. ఆ డబ్బుతో రష్యా నుంచి చమురు కొని ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోంది.. ఈ మాటలు అన్నది ఏ శత్రు దేశం నాయకుడో కాదు..! సాక్షాత్తు అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు వాణిజ్య సలహాదారు. అసలు రెండు దేశాల మధ్య టారిఫ్‌ల వార్ కు ఆయనే సూత్రధారి అనడంలో సందేహం లేదు. ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ ల అమలు ఈ నెల 27 నుంచి కాకుండా మరికొన్ని రోజులు వాయిదా పడుతుందని ఏమూలనో ఉన్న ఆశలను కూడా చిదిమేస్తున్నారు.
ట్రంప్ ను ముంచే సలహాదారు....!
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సలహాదారు నవారో గురించి టెస్లా అధినేత మస్క్ ను అడిగితే బాగా చెబుతారు. అతడిని మూర్ఖుడు అని కూడా అంటారు. ఇప్పుడ ఈ నవారోనే భారత్-అమెరికా సంబంధాలపై పెట్రోల్ చల్లుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్లాన్ ప్రకారం రష్యా నుంచి చమురు కొంటూ భారత్ లాభపడుతోందని నిందిస్తున్నారు. భారత్ టారిఫ్ లు అధికం అని.. రష్యా చమురుతో ఆ దేశ రిఫైనరీలు అధిక లాభాలు గడిస్తున్నాయని ఆరోపించారు. అసలు భారత్ కు రష్యా చమురు అవసరం లేదని అంటున్నారు. రష్యా పట్ల ఆ దేశం వైఖరి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
సంబంధాలను దెబ్బతీసేలా...
భారత్-అమెరికా సంబంధాలు గత మూడు దశాబ్దాలుగా బలపడుతున్నాయి. వాటిని నవారో తన వివాదాస్పద ప్రకటనల ద్వారా విచ్ఛిన్నం చేస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. అయితే, ట్రంప్ ఇచ్చిన స్వేచ్ఛ నవారోకు పట్ట పగ్గాలు లేకుండా చేస్తోంది. 75 ఏళ్ల నవారో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. అయితే, ఆయన పవర్తన ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లకే నచ్చడం లేదు. ఒకప్పటి డెమోక్రాట్ అయిన నవారో.. వియత్నాంపై అమెరికా సాగించిన యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాలిఫోర్నియాలో ఉద్యమాలు చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేసిన నవారోకు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు.
మస్క నే వెళ్లగొట్టిన మొనగాడు...
-1990ల్లో జాతీయవాదిగా మారిన నవారో... స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకిస్తూ, రక్షణాత్మక వాణిజ్య విధానాలను సమర్థించడం చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక కూడా వాణిజ్య సలహాదారుగా నియమితులైన నవారో... ఎలాన్ మస్క్ ను ట్రంప్ నకు దూరం చేశారు. వస్తూనే అల్యుమినియం దిగుమతులపై 25శాతం సుంకం విధించడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాల్లో తయారైన విడిభాగాలతో అమెరికాలో కార్లు తయారు చేస్తారని మస్క్ ను నిందించి.. ఆయనను కార్ అసెంబ్లర్ అంటూ దూషించారు.
-భారత్ పై టారిఫ్ ల విషయంలో ట్రంప్ ను రెచ్చగొడుతున్నది నవారోనే అని అభిప్రాయం. **రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగితే ట్రంప్ నకు నోబెల్ శాంతి బహుమతి వస్తుంది. అది జరగాలంటే.. ఒత్తిడి పెంచేలా రష్యా నుంచి భారత్ చమురు కొనకూడదు** అనేది నవారో విచిత్ర ప్రతిపాదన.
-2020లో ట్రంప్ రెండోసారి అధ్యక్ష ఎన్నికకు పోటీ చేసి ఓడిపోయాక క్యాపిటల్ హిల్స్ వద్ద ఆయన మద్దతుదారులు సమావేశమై అనంతరం అల్లర్లకు దిగారు. ఇందులో నవారోనే కీలకంగా పేర్కొంటారు. అందుకే ఆయనను అమెరికా కాంగ్రెస్ విచారణకు పిలిచింది. కానీ, ఆయన వెళ్లలేదు. దీంతో నాలుగు నెలల జైలు శిక్ష విధించగా నవారో దానిని అనుభవించారు.
