పాక్ కు కొత్త స్ట్రోక్: మొన్న సర్జికల్ స్ట్రైక్.. ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రైక్!
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లపై నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం "సర్జికల్ దాడులు" చేసిన సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 2 May 2025 4:35 PM ISTపాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లపై నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం "సర్జికల్ దాడులు" చేసిన సంగతి తెలిసిందే! ఈ ఘటన 2016 సెప్టెంబర్ 29న జరిగింది! ఉరి ఘటన జరిగినప్పటి నుంచి కసితో రగిలిపోయిన భారత ఆర్మీ.. 2016 సెప్టెంబర్ 28 రాత్రి పీఓకేలో నక్కిన ఉగ్రవాదులపై దాడికి దిగింది! అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రైక్ మొదలుపెట్టింది!
అవును.. నాడు ఉరి ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ.. సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. దీంతో.. ఏమిటనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే ఆర్థికమాద్యంతో కొట్టు మిట్టాడుతున్న పాక్ ను మరింతగా నలగగొట్టాలని భారత్ భావిస్తోంది. ఈ సమయంలో రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ని ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టీ.ఎఫ్) గ్రే లిస్టులోకి పాకిస్థాన్ ను తీసుకొచ్చెలా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్.) నుంచి పాకిస్థాన్ కు అందే 7 బిలియన్ డాలర్ల సహాయంపై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. అదే జరిగితే... పాక్ ఇప్పట్లో తేరుకోనట్లే! కారణం... ఈ 7 బిలియన్ డాలర్ల ఐ.ఎం.ఎఫ్. సాయంపైనే పాకిస్థాన్ భవితవ్యం ఆధారపడి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా జీ-7 దేశాలు కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు ఉగ్రవాదానికి ఊతం ఇస్తాయని.. చాలా వెనుక బడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయని.. ఇలాంటి పనులను నిరోధించడానికి ఏఫ్.ఏ.టీ.ఎఫ్. ఏర్పాటు చేశారు.
పారిస్ కేంద్రంగా జీ-7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం కాదు. అయితే ఈ జీ7 (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూ.ఎస్.ఏ.) దేశాలు సంపన్నవైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎఫ్.ఏ.టీ.ఎఫ్. అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు) లో పాక్ ను ప్రవేశపెట్టేలా చేయాలనేది భారత్ తాజా ఫైనాన్షియల్ స్ట్రైక్ గా చెబుతున్నారు. అదే జరిగితే... పాకిస్థాన్ కు విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు.. ఐ.ఎం.ఎఫ్. సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. దీంతో... పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోతుంది!
ఇక రెండో విషయనికొస్తే... ఇప్పటికే పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని చెబుతున్నారు. బియ్యం, పాలు, గుడ్లు, చికెన్, కాయగూరలు, పండ్లు, పిండి మొదలైన నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోయాయని చెబుతున్నారు. మరోపక్క ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను భారత్ ఆపనుందని తెలుస్తోంది.
పాకిస్థాన్ తో వాణిజ్యాన్ని రద్దు చేసుకున్న అనంతరం తాజాగా టమోటాల ఎగుమతులను కర్ణాటకలోని రైతులు, వ్యాపారులు నిలిపేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోబోతుందని చెబుతున్నారు. ఇది పాక్ పై భారత్ మార్కు ఫైనాన్షియల్ స్ట్రైక్ అని చెబుతున్నారు. ఐ.ఎం.ఎఫ్. రుణం కూడా ఆగితే... పాక్ పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి!
