Begin typing your search above and press return to search.

పాక్ పక్కలో బల్లెంతో భారత్ కరచాలనం!

అవును... పహల్గాం ఊచకోతపై పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ముందుకు వస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని భారతదేశం తనవైపు తీసుకుంటోంది.

By:  Tupaki Desk   |   30 April 2025 10:00 PM IST
పాక్  పక్కలో బల్లెంతో భారత్  కరచాలనం!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ ను గట్టిగా కొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తున్న భారత్.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే పలు బలమైన దేశాల మద్దతు కూడగట్టింది. ఇందులో అమెరికాతో పాటు యూకే, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, మొదలైన దేశాలున్నాయి. ఇదే సమయంలో పాక్ శత్రువులను భారత్ కలుపుకుపోతుంది.

అవును... పహల్గాం ఊచకోతపై పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ముందుకు వస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని భారతదేశం తనవైపు తీసుకుంటోంది. ఖైబర్-పఖ్తుంఖ్వాలో లో తాలిబన్ సంబంధిత తిరుగుబాటును పాక్ ఎదుర్కొంటున్న వేళ.. కాబూల్ తో భారత్ చర్చలు జరిపింది.

దీంతో... ఈ సమయంలో కాబూల్ తో దౌత్యం భారత్ యొక్క ఒక తెలివైన వ్యూహాత్మక చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి భారత ప్రత్యేక ప్రతినిధి ఎం ఆనంద్ ప్రకాష్.. కాబూల్ లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాకిని కలిశారు. తాజా పరిణామాలపై చర్చించారు!

వాస్తవానికి భారత ప్రతినిధి బృందంతో సమావేశానికి ముందే.. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా స్పందించిన తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్ఖీ... పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

ఇదే సమయంలో.. ఆ ఉగ్రదాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. దీంతో... పాక్ – ఆఫ్ఘాన్ సంబంధాలు క్షీణిస్తున్నందున.. న్యూఢిల్లీ, కాబుల్ మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని సూచిస్తుందని అంటున్నారు.

కాగా.. గత కొంతకాలంగా తాలిబన్లతో పాకిస్థాన్ సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... ఆఫ్ఘన్ శరణార్థులను బహిష్కరించాలని ఇస్లామాబాద్ తీసుకున్న నిర్ణయం అనంతరం ఈ దూరం మరింత తీవ్రమైందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే... పాక్ పక్కలో బల్లెంలా మారిన ఆఫ్ఘన్ తో భారత్ కరచాలనం ప్రస్తుతం పరిస్థితుల్లో ఇస్లామాబాద్ కు బ్యాడ్ న్యూస్ అని చెబుతున్నారు.